News

భారత్‌ ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదు – అమెరికా

377views

* రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా

ష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై తాజాగా అమెరికా స్పందించింది. ఈ విషయంలో భారత్‌ ఆంక్షలు ఉల్లంఘిస్తున్నట్లు కాదని పేర్కొంది.

ఉక్రెయిన్ ‌పై దండయాత్ర నేపథ్యంలో రష్యాపై అమెరికా సహా ప్రపంచ దేశాలు అనేక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ దేశం నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులు చేసుకోరాదని అగ్రరాజ్యం నిర్ణయించింది. అయితే ఈ ఆంక్షలతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా.. తమ దేశం నుంచి ముడి చమురును భారత్ ‌కు డిస్కౌంట్‌లో అమ్మాలని అనుకుంటున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు భారత్‌ కూడా సిద్ధంగా ఉందనే కథనాలు కూడా వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే భారత్‌కు రష్యా ఆఫర్ ‌పై వైట్‌ హౌస్ మీడియా కార్యదర్శి జెన్ ‌సాకీని విలేకరులు ప్రశ్నించారు. దీనికి సాకీ స్పందిస్తూ.. ”భారత్… రష్యా నుంచి డిస్కౌంట్‌లో చమురు కొనుగోలు చేయడం…. ఆంక్షలను ఉల్లంఘించినట్లు కాదు. అయితే అలాంటి చర్య చేపడితే చరిత్ర పుస్తకాల్లో మీరు (భారత్‌ను ఉద్దేశిస్తూ) ఏ వైపున ఉంటారనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ విషయంలో భారత్‌ ముందుకెళ్తే తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లే అని అనుకోవాల్సి వస్తుంది. రష్యా నాయకత్వానికి మద్దతు ఇస్తున్నారంటే.. ఉక్రెయిన్ ‌పై దండయాత్రను కూడా సమర్థిస్తున్నట్లే.” అని స్పష్టం చేశారు.

యుద్ధాన్ని ఖండిస్తున్నాం… కానీ రష్యాతో మా సత్సంబంధాలు కొనసాగుతాయి – భారత్

ఉక్రెయిన్ ‌పై రష్యా దండయాత్రను తాము సమర్థించడం లేదని మన దేశం‌ ప్రకటించింది. ఈ విషయంలో ఇరు పక్షాలూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతోంది. అయితే రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన తీర్మానాలకు మాత్రం భారత్‌ దూరంగా ఉంటూ వస్తోంది. రష్యా నుంచి భారత్‌ సైనిక పరికరాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ తటస్థ వైఖరి పాటిస్తున్నట్లు బైడెన్‌ యంత్రాంగం ఇప్పటికే చాలా సార్లు అభిప్రాయాలు వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.