News

ఉండ్రాజవరంలో మైత్రేయ బుద్ధవిహార్‌లో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

32views

ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి, ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన ‘మైత్రేయ బుద్ధ విహార్’ ప్రారంభోత్సవంలో మంత్రి దుర్గేశ్‌   ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బౌద్ధ దమ్మ పీఠాధిపతి బంతె అనాలయో, శ్రీలంక నుంచి విచ్చేసిన డాక్టర్ బోధగామ చండిమా నాయకే థీరోల ఆశీస్సులు స్వీకరించిన మంత్రి దుర్గేశ్‌.. పలు దేశాల నుంచి విచ్చేసిన బౌద్ధ ప్రతినిధులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్‌ మాట్లాడుతూ.. బుద్ధుడు సంచరించిన పవిత్ర ప్రాంతంగా నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరానికి గుర్తింపు ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ దిశానిర్దేశంలో పర్యాటక శాఖను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని, యువత, విద్యార్థుల్లో ఆధ్యాత్మిక, నైతిక విలువలను పెంపొందించేలా ఈ విహార్ తోడ్పడుతుందన్నారు. మైత్రేయ బుద్ధ విహార్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా, విశ్వవ్యాప్తం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉత్తర భారతదేశం తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరినట్లు మంత్రి దుర్గేశ్‌ తెలిపారు.

రాష్ట్రంలోని తొట్లకొండ, బావికొండ, ఆదుర్రు, ఉండ్రాజవరం, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలోనే బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. శాంతి, సహనం, అహింస అనేవి ఏ కాలానికైనా ఆచరణీయమైనవని, ద్వేషాన్ని ప్రేమతోనే జయించగలమన్న బుద్ధుని సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్ వంటి ఎందరో మహానీయులు కూడా ఈ మార్గాన్ని అనుసరించారని గుర్తుచేశారు.