కాకినాడలోని ఓ సినిమా థియేటర్…. ఈ నెల 11 వ తారీఖు నుంచి “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాను తమ థియేటర్లో ప్రదర్శిస్తామంటూ ఘనంగా ప్రకటించారు. ఎవరైనా దాడి చేస్తారని భయపడ్డారో, థియేటర్ యాజమాన్యానికి ఏవైనా వత్తిళ్ళు, బెదిరింపులు వచ్చాయో, సినిమా పెద్దగా ఆడదని సందేహించారో… మొత్తానికి అనుకున్న సమయానికి తమ థియేటర్లో కాశ్మీర్ ఫైల్స్ సినిమానయితే ప్రదర్శించలేదు.
అయితే 13వ తేదీన ఓ యువకుడు థియేటర్ వద్దకెళ్ళాడు. అతను ఓ సాధారణ టైలర్. సినిమా ఎప్పుడు ప్రదర్శిస్తారని హాలు వారిని అడిగాడు. మేం ఆ సినిమా ప్రదర్శించబోవటం లేదని హాలు వారి సమాధానం.
‘అదేంటి ప్రకటించారుగా ఇప్పుడెందుకు మానుకున్నార’ని కుర్రాడి ప్రశ్న.
‘అప్పుడు వేద్దామనుకున్నాం… ఇప్పుడు వద్దనుకున్నాం…’ నీకు సమాధానం చెప్పేదేంటి పొమ్మని హాలు వారి దబాయింపు.
‘మీరేవరికో భయపడుతున్నట్టున్నారు. మీరు భయపడ్డట్టు ఏమీ జరగదు. రాక రాక ఓ మంచి సినిమా వచ్చింది. ఆపకుండా ప్రదర్శించండి.’ కుర్రాడి అభ్యర్ధన.
“మేమేవరికీ భయపడడం లేదు. వెయ్యడం వెయ్యకపోవడం మా ఇష్టం.” హాలు వారి బెట్టు.
“కనీసం 3 రోజులపాటన్నా సినిమాని ప్రదర్శించండి భయ్యా… మీకు తగినంత కలెక్షన్ రాకపోతే ఆ డబ్బులేవో నేనిస్తాను. మూడు రోజుల తర్వాత మీ ఇష్టం. ఉంచాలనుకుంటే ఉంచండి… లేకపోతే లేదు…” కుర్రాడి ఆఫర్.
అయినా హాలు వాళ్ళు ససేమిరా అన్నారు.
“మీరు నా ఒక్కడికీ సమాధానం చెప్పేట్టు లేరు. సాయంత్రం నా మిత్రులు మరో వెయ్యి మంది వస్తారు. మీరు చెప్పే సమాధానమేదో వాళ్ళకి చెప్పండి.” అంటూ ఆ యువకుడు బయటకు వచ్చేస్తున్నాడు.
ఆ దగ్గరలోనే నిలబడి ఈ వాగ్వాదమంతా వింటున్న ఓ పెద్దాయన ఆ కుర్రాడ్ని దగ్గరకు పిలిచారు.
“చాలా చక్కగా మాట్లాడావ్ తమ్ముడూ… శెభాష్. నువ్వు ఇదే పట్టు మీద ఉండు. సినిమా వేయించు. ఇదిగో నాతరపున ఓ 60 టిక్కెట్లకి డబ్బులిస్తున్నా… ఉంచు.” అంటూ ఓ 60 టిక్కెట్లకి సరిపడా డబ్బులు ఆ యువకుని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడా పెద్దాయన. ఆయనది పిఠాపురం.
సరిగ్గా అరగంట తర్వాత హాలు వారి దగ్గర్నుంచీ ఆ కుర్రాడికి ఫోనొచ్చింది. “ బాబూ మా దుందుడుకు సమాధానాలకు క్షమించు. రేపటి నుంచి సినిమా వేస్తున్నాం.” కుర్రాడి ఆనందానికి అవధుల్లేవు. తర్వాతిరోజు తన మిత్రులనందరినీ పోగేసుకు వెళ్లి సినిమా చూసొచ్చాడు. అదే రోజు ఆ పిఠాపురం పెద్దాయన కూడా తన కుటుంబంతో కలిసి సినిమాకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ థియేటర్ హవుస్ ఫుల్ కలెక్షన్లతో క్రిక్కిరిసిపోతోంది.
ఒక సాధారణ టైలర్. ఒక సామాన్యుడు. సత్యం వైపు, ధర్మం వైపు నిలుచున్నాడు. శక్తికి మించి త్యాగానికి సిద్ధపడ్డాడు. న్యాయాన్ని గెలిపించాలనుకున్నాడు. నిజాన్ని ఎలుగెత్తాలనుకున్నాడు. సమాజం నుంచి స్పందన, అండ లభించింది. సత్యం గెలిచింది. న్యాయం నిలిచింది. అర్థమైందా? ఒక్కడు… ఒక్కడు న్యాయం వైపు నిలుచున్నా… యావత్ సమాజం అతనికి దన్నుగా నిలుస్తుంది. ఆ ఒక్కడు నేనే కావాలని మనమనుకోవాలి. ధైర్యంగా, దృఢంగా, స్థిరంగా నుంచోవాలి. అప్పుడు నిస్సందేహంగా ధర్మానిదే అంతిమ విజయం. యతో ధర్మః తతో జయః.