News

స్వామి లక్ష్మణానంద సరస్వతి ఆధ్యాత్మిక చైతన్యానికి దిక్సూచి

31views
భువనేశ్వర్ :ధర్మం కోసం నిలబడే మహనీయులను అంతం చేయడం ద్వారా ఆ ప్రయత్నాలను అడ్డుకోవచ్చని ధర్మ విరోధులు భావించవచ్చు కానీ, అది సాధ్యమయ్యే పని కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలేవీ దేశాన్ని బలహీనపరచలేవని తేల్చి చెప్పారు.
భువనేశ్వర్‌లోని రైల్వే ఆడిటోరియంలో జరిగిన “వేదాంత కేసరీ స్వామి లక్ష్మణానంద సరస్వతి: కృతి ఏవం వ్యక్తిత్వ” అన్న పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా హోసబళే మాట్లాడుతూ ఒడిశాలో ధర్మ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన స్వామి లక్ష్మణానంద సరస్వతిని దుండగులు పొట్టనబెట్టుకున్నప్పటికీ, ధర్మ ప్రచారం మరియు దేశ నిర్మాణ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆయనలాంటి వారు మరెందరో ఉద్భవిస్తున్నారని అన్నారు. ఇది ఎవరికీ తలవంచని, ఎప్పటికీ చెక్కుచెదరని దృఢమైన, శాశ్వతమైన భారత్ అని అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి మరియు సంబల్‌పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్, ‘న్యాస్’ (సంస్థ) అధ్యక్షుడు స్వామి జీవన్ ముక్తానంద పురితో పాటు అనేకమంది సాధువులు, సామాజిక కార్యకర్తలు మరియు ప్రముఖ పౌరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ట్రస్టీ మన్సుఖ్ లాల్ సేథియా నిర్వహించారు.
గురు తేగ్ బహదూర్, స్వామి శ్రద్ధానంద నుండి స్వామి లక్ష్మణానంద సరస్వతి వరకు, ఎంతోమంది వ్యక్తులు ధర్మం మరియు సమాజ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. దేశం కోసం పనిచేస్తున్న వ్యక్తులపై దేశంలోని వివిధ ప్రాంతాలలో దాడులు జరిగాయని, ఇందులో కేరళలో వామపక్ష వర్గాల హింస మరియు అనేక రాష్ట్రాల్లో నక్సలైట్ ఉగ్రవాదుల దాడులు కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇన్ని దాడులు జరిగినా, ధర్మ రక్షణా ఉద్యమాలు ఎక్కడా ఆగడం లేదని, దాడులు చేసిన వారిది కూడా పైచేయి ఎక్కడా కాలేదన్నారు. పైగా మరింత మంది పనిచేసేలా ప్రేరణనిస్తాయని అన్నారు. అలాగే కష్టకాలంలో వ్యక్తి సేవా భావం, త్యాగనిరతి అన్న లక్షణాలు మరింత బలపడతాయని అన్నారు.
స్వామి లక్ష్మణానంద సరస్వతి తన జీవితమంతా ధర్మ పరిరక్షణకు, సామాజిక వ్యవస్థకు, సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడానికి అంకితం చేశారని హోసబాలే పేర్కొన్నారు.ఆయన స్వయంగా అవిశ్రాంతంగా పనిచేయడమే కాకుండా, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తున్న వేలాది మంది స్వచ్ఛంద కార్యకర్తలకు శిక్షణనిచ్చి, స్ఫూర్తినిచ్చారన్నారు.దేశం మరియు ధర్మం కోసం అంకితమైన వ్యక్తుల జీవితాలను తెలియజేసే పుస్తకాలు, దేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా యువతను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
స్వామి లక్ష్మణానంద సరస్వతి ప్రాపంచిక జీవితాన్ని, భౌతిక బంధాలను త్యజించి, గిరిజన వర్గాల అభ్యున్నతికి, గోసంరక్షణకు, ధర్మజాగరణకు, సామాజిక సేవకు తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్నారని హోసబాలే పేర్కొన్నారు. ఆయన బాధలను తగ్గించడానికి, విలువలు మరియు విశ్వాసంపై ఆధారపడిన మార్గంలో ప్రజలను నడిపించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు.
ప్రపంచానికి దిశానిర్దేశం చేసే శక్తిగా భారత్ తన పాత్రను కొనసాగించాలంటే, ప్రస్తుత తరం స్వామి లక్ష్మణానంద సరస్వతి జీవితం మరియు తత్వశాస్త్రం నుండి స్ఫూర్తిని పొందాలని హోసబలే నొక్కిచెప్పారు. ఆయన స్వామీజీని కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా, ఒక భావనగా, ఒక తత్వంగా మరియు జాతీయ జీవనానికి శక్తివంతమైన స్ఫూర్తిమంతమైన వారుగా అభివర్ణించారు.
స్వామి లక్ష్మణానంద సరస్వతి కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదని, కాంధమాల్‌లోని గిరిజన వర్గాలకు ఒక రక్షక శక్తిగా మరియు ఆధ్యాత్మిక చైతన్యానికి దిక్సూచిగా నిలిచారని ముఖ్యమంత్రి మాంఝీ అన్నారు. చకపాద మరియు జలేష్‌పట ఆశ్రమాల వంటి సంస్థల ద్వారా, ఆయన గిరిజన బాలికలకు విద్యను అందించడంతో పాటు వారు స్వయం సమృద్ధి సాధించేలా శక్తివంతులను చేయడానికి కృషి చేశారు.