News

ఆప్ నేత మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్లలో సీబీఐ తనిఖీలు

587views

దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ అధికారులు..

తాజాగా ఆయన బ్యాంకు లాకర్లనూ పరిశీలించారు. మంగళవారం ఉదయం సిసోడియా, ఆయన సతీమణి ఉత్తరప్రదేశ్‌ ఘాజియాబాద్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ ‌కు చేరుకున్నారు. వీరి సమక్షంలో సీబీఐ అధికారులు లాకర్లను తనిఖీ చేశారు. అయితే ఈ సోదాల్లో అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని సమాచారం.

ఢిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలున్నట్లు ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ ‌శాఖకు ఇన్‌ఛార్జ్ ‌గా ఉన్న మనీశ్‌ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే సీబీఐ కేసు నమోదు చేసి, రంగంలోకి దిగింది. ఈ కేసులో సిసోడియా సహా మొత్తం 15 మంది వ్యక్తులు, ఓ కంపెనీ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ క్రమంలోనే ఆగస్టు 19న సిసోడియా నివాసం సహా దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు నిర్వహించింది. ఆప్‌ సీనియర్‌ నేత సిసోడియా.. విద్యాశాఖతో పాటు ఎక్సైజ్‌ శాఖనూ చూస్తున్నారు. ఈ సోదాల విషయంలోనే ఆప్‌, భాజపా మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.