ArticlesNews

అమరనాథుడు కరిగిపోతున్నాడా?

4views

వాతావరణ మార్పుల ప్రభావం… అమరనాథుడి దర్శనంపైనా పడుతోందా? అవుననే ఆందోళన వ్యక్తమవుతోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమరనాథ్‌ యాత్ర ఈసారి త్వరగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహల్లో ఏటా సహజంగా ఏర్పడే మంచు శివలింగం ఈసారి త్వరగా కరిగి పోతుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈనెల 3న యాత్ర ఆరంభమైంది. తర్వాత 5 రోజుల్లోనే శివలింగం భారీగా కరిగిపోయినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే వేల మంది భక్తులు అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో ఉన్నారు. శివలింగం పూర్తిగా కరిగిపోయేలోగా అమరనాథుడిని దర్శించుకోవాలని వారంతా కోరుకుంటున్నారు.

ఎప్పటి నుంచో హెచ్చరికలు

హిమాలయాల్లో హిమనీ నదాలు, సహజంగా ఏర్పడే మంచు కొండలు గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఎప్పటి నుంచో పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేడి వాతావరణం, మారుతున్న గాలుల సరళి, గుహల్లోని వాతావరణ మార్పులవంటివి మంచు త్వరగా కరగడానికి కారణమవుతున్నాయి.

12 అడుగుల వరకూ..

సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తునున్న అమర్‌నాథ్‌ గుహల్లో సాధారణంగా శివలింగం 12 అడుగుల ఎత్తు వరకూ సహజసిద్ధంగా ఏర్పడుతుంటుంది.

శివలింగం భారీగా కరిగిపోవడం ఇటీవలి కాలంలో తరచూ చోటుచేసుకుంటోంది. ఫలితంగా చాలా మంది భక్తులకు దర్శన భాగ్యం కలగడం లేదు. వాతావరణ మార్పులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.