
గ్వాలియర్: ఇక్కడి శివపురి లింక్ రోడ్డులోని సరస్వతి శిశు మందిర్ కేదార్ధామ్ కాంప్లెక్స్‌లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఘోష్ వాయిద్యాల ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. మొదటిరోజు ఘోష్ వాయిద్యాలతో పాటు ఇతర వాయిద్యాలను ప్రదర్శించారు. ఘోష్ వాయిద్యాల(అనక్, పనవ, ఝాలారి, శంఖ్, వంశీ, వేణు, నాగాంగ్, తుర్యా, స్వరద్, గౌముఖ్, ప్రతాన్ ప్రాతుర్య, ఘోష్ దండ్)తో పాటు హార్మోనియం, తురై, తబలా, మృదంగ్, వీణ వాయిద్యాలు కూడా ఈ ప్రదర్శనలో పెట్టారు. అలాగే ‘ఘోష్ చరిత్ర మరియు అభివృద్ధి’ గురించి కూడా ఆసక్తికరమైన సమాచారాన్ని సినిమా ద్వారా చూపిస్తున్నారు.

ప్రదర్శనను పురస్కరించుకుని నిన్న సాయంత్రం అయిదు గంటలకు స్వయం సేవకుల పథ సంచలన్ చేశారు. సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాధారణ రోజుల్లో సంఘ్ వాయిద్య పరికరాలను సామాన్యులకు చూసే భాగ్యం కలగదు. నాలుగు రోజులపాటు ఉండే ఈ ప్రదర్శనలో అన్ని వర్గాల ప్రజలు చూసే వీలుంటుంది.
అంతకుముందు ఉదయం ఘోష్ చారిత్రక ప్రయాణ ఆధారిత ప్రదర్శనను సెంట్రల్ ఇండియా ప్రావిన్స్ సంఘచాలక్ అశోక్ పాండే ప్రారంభించారు. మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ రాజా మాన్‌సింగ్ తోమర్, ప్రొఫెసర్ సాహిత్య కుమార్ నహర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా అశోక్ పాండే మాట్లాడుతూ ఈ ప్రదర్శన ప్రాథమికంగా భారతీయ శాస్త్రీయ కళాకారులపై ఆధారపడి ఉంటుందన్నారు. పురాతన భారతీయ రాగాలు ప్రభావవంతంగా ఉండటమే కాకుండా వాటి విలక్షణమైన శైలి, స్వాభావిక శక్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని పేర్కొన్నారు. వీటి ఆధారంగా నాలుగు రకాల కళా ప్రక్రియలను ఈ ప్రదర్శనలో ఉన్నాయని, మొదటి భాగంలో సంప్రదాయకమైన అతి ప్రాచీనమైన, అరుదైన సంగీత వాయిద్యాలు ఉన్నాయని పాండే తెలిపారు.

రెండో భాగంలో దేశంలోని ప్రముఖ గాయకులు, వాయిద్యకారుల జీవిత విశేషాలను చిత్రపటం ద్వారా పరిచయం ఉంటుందని, మూడో భాగంలో దేశవ్యాప్తంగా ఉన్న పురాతన వాయిద్యాల చిత్రపటాల ప్రదర్శన, నాలుగో భాగంలో రాష్ట్రీయ స్వయంసేవక్ ఘోష్ యాత్ర చరిత్ర, స్వరకల్పనలను డిజిటల్ ద్వారా వివరిస్తున్నట్టు పేర్కొన్నారు.

మానవ జీవితంలోని ఆచార వ్యవహారాలలో సంగీతానికి తనదైన ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. సంఘ్‌లో ఘోష్ ప్రయాణం 1927 నుంచి ప్రారంభమైందని అశోక్ పాండే తెలిపారు. ప్రారంభంలో, శంఖం, వంశీ, అనక్ వంటి ప్రాథమిక వాయిద్యాలపై వాయించడం మొదలెట్టారని, కార్యకర్తల అవిశ్రాంత కృషితో, శాస్త్రీయ రాగాల ఆధారంగా స్వరకల్పనలు సృష్టి జరిగిందని వెల్లడించారు. సంఘంలో నేడు అరవైకి పైగా రచనలు కంపోజిషన్లు ప్లే చేయబడుతున్నాయని వివరించారు. సంఘ్ కార్యకర్త హేమంత్ సేథియా, ప్రావిన్స్ ప్రచార చీఫ్ ఓంప్రకాష్ సిసోడియా, 31 జిల్లాల నుండి 550 మంది ఘోష్ కళాకారులు హాజరయ్యారు.





