
ప్రపంచంలో అనేకమంది మేధావుల, జిజ్ఞాసువుల జ్ఞానతృష్ణను ఏడు శతాబ్దాల పాటు తీర్చిన నలంద విశ్వవిద్యాలయంలో విద్యా సముపార్జనకు నాటి మేధావులు తహతహలాడేవారు. యూరప్‌లోని ప్రాచీన బోలోగ్నా యూనివర్సిటీ, ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల కంటే 500 ఏళ్ల ముందే నలంద విశ్వవిద్యాలయం ప్రపంచానికి మేధో సంపత్తిని పంచిపెట్టింది. అంతటి మహా విద్యాలయం మతోన్మాద మూర్ఖతకు దహనమై విద్యార్థులకు వేదనను మిగిల్చింది. దాదాపు శతాబ్దాల అనంతరం దాని పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టిపెట్టడం అత్యంత హర్షణీయం, స్వాగతించవలసిన విషయం.
ప్రధాని మోదీ 135వ ‘మన్ కీ బాత’లో అనేక విషయాలపై అభిప్రాయాలు వెల్లడిస్తూ ‘నలంద విశ్వవిద్యాలయ’ పునరుద్ధరణ అంశాన్ని ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా మరోసారి నలందపై కొత్త ఆసక్తి మొదలైంది. రెండేళ్ల క్రితం నలంద ప్రాంగణాన్ని ప్రారంభించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు ప్రధాని మోదీ. నలంద విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవం సందర్భంగా మే,17,18 తేదీల్లో ‘శాస్త్రార్థ -2026’ పేరిట మేధోమథనం జరిగింది. “శాస్తార్థ సంప్రదాయం: చరిత్ర, ఆచరణ-సమకాలీన ప్రాసంగికత” అనే అంశంపై నిపుణులతో వినూత్న పద్ధతిలో చర్చా కార్యక్రమం జరిగింది. భారతదేశ జ్ఞాన సంప్రదాయంలోని వివిధ వైఖరులు, దృక్పథాలకు చెందిన పండితులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతకు మన ప్రాచీన మేధో మూలాలను అన్వయించడం అత్యవసరమని ప్రధాని అభిప్రాయ పడడం ముదావహం.
సాధారణ శకం 427లో గుప్త సామ్రాజ్య చక్రవర్తి తొలి కుమార గుప్తుడు స్థాపించిన నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యÖనివర్సిటి. మధ్యయుగాలనాటి ముఖ్యమైన విశ్వవిద్యాలయాలలో ఒకటైన నలందలో రత్నసాగర, రత్నోదధి, రత్నరంజక అనే మÖడు భవనాలతో ఉండే గ్రంథాలయాల్లో కోటికి పైగా పుస్తకాలు ఉండేవని.. తూర్పుఆసియా, మధ్యఆసియా ప్రాంతాల నుంచి అప్పట్లోనే 10 వేలమందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారని చరిత్ర చెప్తోంది.
మాల్వా పీఠభూమికి ఉత్తర దిక్కున ఉన్న రాజగిరి జిల్లా కుండపోత వర్షాలకు, ఆకస్మిక వరదలకూ నెలవు. కుమార గుప్తుడు పధ్నాలుగు వర్షాకాలాలు రాజగిరి ప్రాంతంలో గడిపి, నలందను నిర్మించాడని పురావస్తు శాస్త్రజ్ఞుడు అమలానంద ఘోష్ తమ ‘నలంద’ గ్రంథంలో అంటారు. నలంద విశ్వవిద్యాలయంలోని పుస్తక భాండాగారం అంతటిది ప్రపంచంలో ఇంకెక్కడా ఉండేది కాదు.
నలంద విశ్వవిద్యాలయంలోని మూడు గ్రంథాలయ భవనాలలో ఒకదాని గురించి టిబెట్ బౌద్ధ మేధావి తారానాథ్ వర్ణిస్తూ మేఘాలలో ఉండే 9 అంతస్తుల భవనమని అభివర్ణించారు. శిఖరాలను అధిరోహించడం, గహనాటవులను జయించడం, ప్రహేళికలను పరిష్కరించడమే కాదు..సమస్త జీవనరంగాలను వ్యాఖ్యానించగల శాస్త్ర ప్రమాణాలను రూపొందించిన ఘనత ప్రాచీన నలంద విశ్వవిద్యాలయానికే దక్కుతుంది. అధ్యయనం, పరిశోధనలు నైపుణ్యంగా, ప్రాచీనతలోకి తొంగిచూసేందుకు అవశ్యమైన సామర్థ్యంగా తీర్చిదిద్దేందుకు ‘శాస్త్రార్థ’ సంప్రదాయాన్ని నెలకొల్పింది.
నలందలో నాగార్జునుడు, వసుబంధు, శాంతరక్షిత, కమలాశిల వంటి గొప్ప పండితులు మధ్యయుగ శాస్త్రీయ పద్ధతి అభివృద్ధికి దారితీసిన మాండలిక తార్కిక పద్ధతి (Dialectical reasoning method)ని అభివృద్ధి చేయడంలో దోహదపడ్డారు. ఈ విధానం మధ్య ఆసియాకు, చివరికి అరబ్ ప్రపంచం, యÖరప్ దేశాలకు వ్యాపించి, ప్రపంచంలోని అనేక దేశాలను ప్రభావితం చేసింది.
సాధారణశకం 5వ శతాబ్దంలో మిహిర్కుల ఆధ్వర్యంలో హూణులు నలంద విద్యా కేంద్రంపై దాడి చేశారు. సాధారణ శకం చిట్టచివర (1193) ప్రాంతంలో దురాక్రమణదారుడైన భక్తియార్ ఖిల్జీ నేతృత్వంలోని దోపిడీ దళాలు ఉత్తర, తూర్పు భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు నలంద జ్ఞాన భాండాగారం ధ్వంసమై పోయింది. ఇస్లాం మతానికి నలంద విశ్వవిద్యాలయం పోటీగా మారుతుందని భావించిన ఖిల్జీ నలందను నాశనం చేశాడని చరిత్ర చెపుతోంది.
ఖిల్జీ దళాలు పెట్టిన మంటల్లో విశ్వవిద్యాలయం మÖడు నెలల పాటు దహనమైందంటారు చరిత్రకారులు. దీనినిబట్టి ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణం వైశాల్యం ఎంతో, నిర్మాణ పటిష్ఠత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్తల్లో ఒకరైన హెచ్‌డీ సంకాలియా 1934లో ప్రచురించిన తన ‘ది యూనివర్సిటీ ఆఫ్ నలంద’ పుస్తకంలో భారీ కోట తరహా నిర్మాణం, అక్కడున్న సంపద గురించి, అప్పటికే జరిగిన ప్రచారం ఖిల్జీ ముఠాను దాడికి పురికొల్పి ఉండొచ్చని రాశారు.
నలంద పునరుద్ధరణ కోసం భారత పార్లమెంటు 2010లో ఒక చట్టాన్ని ఆమోదించి నప్పటికీ ఆ తరువాత పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం 2014లో నలంద విశ్వవిద్యాలయాన్ని పునఃప్రారంభించింది. రెండేళ్ల క్రితం ప్రాంగణాన్ని ప్రారంభించారు. సరికొత్త నలందను ‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ’గా గుర్తించడం మనందరం గర్వించదగ్గ విషయం. 2016లో నలందా శిథిలాలను ప్రపంచ వారసత్వ స్థలం (సంపద) గా యునెస్కో ప్రకటించింది.
నలంద భారతదేశ విద్యా వైభవానికి, ఆసియా సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక మాత్రమే కాదు ప్రపంచ చరిత్రలో విద్యాదానం చేసిన మహా విద్యాలయమని కూడా చెప్పుకోవాలి. నలంద పునరుజ్జీవనం భారతదేశానికి తలమానికం కాగలదని ఆశిద్దాం.





