News

భారత్-పాక్ సరిహద్దు వద్ద 12 అక్రమ మసీదుల కూల్చివేత

26views

జైపూర్: జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రాజస్థాన్ ప్రభుత్వం భారత్–పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టింది. సరిహద్దుకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 12 అక్రమ మసీదులను అధికారులు కూల్చివేశారు. ఈ చర్యపై స్థానికంగా కొందరు ముస్లిం వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, విషయం ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు పరిశీలనలో ఉంది.

హైకోర్టులో దాఖలైన పిటిషన్ ప్రకారం, జూన్ 18 నుంచి 20 మధ్య బార్మర్, బికనీర్ తదితర సరిహద్దు జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో సుమారు 12 మసీదులను అధికారులు తొలగించారు.

జాతీయ భద్రత కోసమే చర్య: రాష్ట్ర ప్రభుత్వం

ఈ వ్యవహారంపై రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టుకు తన వాదనలు వినిపించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణం చేపట్టాలన్నా సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సరిహద్దు భద్రత దృష్ట్యా అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే ఈ చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ అంశం నేరుగా జాతీయ భద్రతకు సంబంధించినదని, సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను ఉపేక్షించే అవకాశం లేదని పేర్కొంది.

ఈ వ్యవహారంపై రాజస్థాన్ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కోర్టు తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.