
విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో స్థానికుల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన తోమడపు ఎద్దుకు ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించారు. సింహాద్రి అప్పన్న స్వామి స్వరూపంగా భావిస్తూ ఎన్నో సంవత్సరాలుగా భక్తుల పూజలు అందుకున్న ఈ ఎద్దు మృతి చెందడంతో పట్టణ ప్రజలు, భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
శృంగవరపుకోట పట్టణంలోని వేమలి వీధి ప్రజలు ఈ తోమడపు ఎద్దును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదరించేవారు. శుభకార్యాలు, పండుగలు, ఆలయ ఉత్సవాల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగేది. సింహాద్రి అప్పన్న స్వామి అనుగ్రహ స్వరూపంగా భావించిన ఈ ఎద్దు మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి నివాళులర్పించారు.
వేమలి వీధి నుంచి శృంగవరపుకోట పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా తోమడపు ఎద్దు అంతిమ యాత్ర కొనసాగింది. పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుకు భక్తులు పుష్పాంజలి ఘటిస్తూ, భజనలు చేస్తూ భక్తి భావంతో చివరి వీడ్కోలు పలికారు. ఈ అంతిమ యాత్రలో మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం వేమలి వారి కల్లాల్లో సంప్రదాయబద్ధంగా తోమడపు ఎద్దుకు అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.
స్థానికుల ఆధ్యాత్మిక విశ్వాసాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన తోమడపు ఎద్దు మృతి శృంగవరపుకోట ప్రజలను కలచివేసింది. తమ గ్రామంలో సింహాద్రి అప్పన్న స్వామి ప్రతిరూపంగా ఈ ఎద్దు సంచరించడం వల్ల శుభాలు కలిగాయని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇకపై ఆ స్వామివారే తమ గ్రామానికి అండగా నిలవాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.
ఈ ఘటనతో శృంగవరపుకోట పట్టణంలో విషాద వాతావరణం నెలకొంది.





