News

బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్.. 72 మంది మృతి.. బాధ్యులను వెంటాడి వేటాడతామని ప్రకటించిన అమెరికా..

1kviews

బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ కాబుల్‌ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.

“ఈ మిషన్ ‌ను తప్పకుండా పూర్తి చేయాలి. మేము చేస్తాం. టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకోలేరు” అని బైడెన్ అన్నారు. అలాగే కాబూల్ దాడికి బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వెంటాడి వేటాడుతామని ప్రతిజ్ఞ చేశారు.

గురువారం నాడు సాయంత్రం ఆరు గంటలకు కాబూల్ విమానాశ్రయం వద్ద దాడి జరిగింది.
ముందుగా ఎయిర్ ‌పోర్ట్ అబే గేట్ దగ్గర పేలుడు జరిగింది. ఆ తర్వాత కాల్పులు చోటు చేసుకున్నాయి.
అమెరికా, బ్రిటన్ సైనికులు ప్రజలను తనిఖీ చేసి ఈ గేట్ నుంచే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు.

కొన్ని నిమిషాల తర్వాత బ్రిటన్ అధికారులు ఉన్న ఒక హోటల్ దగ్గర రెండో పేలుడు జరిగింది. బ్రిటన్ ‌కు వెళ్లాలనుకుంటున్న అఫ్గాన్ల దరఖాస్తులను ఆ దేశ అధికారులు ఈ హోటల్‌లో పరిశీలిస్తుంటారు. బాంబు పేలుళ్లలో 13మంది అమెరికన్లు సహా 60 మంది చనిపోయారు.

ఇస్లామిక్ స్టేట్ ప్రాంతీయ శాఖ అయిన ఐసిస్-K దాడి చేసే ప్రమాదం ఉందని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ప్రజలను తరలిస్తున్న విమానంలో తమకు అవకాశం ఇస్తారన్న ఆశతో వేలాది మంది అఫ్గాన్లు ఎయిర్‌పోర్ట్ దగ్గరికి వచ్చారు. కాబూల్ జంట పేలుళ్లకు తమదే బాధ్యతని ఈ జిహాదీ గ్రూప్ ప్రకటించుకుంది.

ఉగ్రదాడిని ఖండించిన భారత్

కాబూల్ విమానాశ్రయంలో జరిగిన పేలుళ్ల ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని కాబుల్‌ ఘటన సూచిస్తోందని తెలిపింది. మృతుల కుటుంబాలకు కేంద్ర విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకతాటిపై నిలవాలని సూచించింది. కాబుల్ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుళ్ల ఘటనలో 72 మంది దుర్మరణం చెందారు. మరో 143 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 12మంది అమెరికా రక్షణ సిబ్బంది కూడా ఉన్నారు. ఇవి ఆత్మాహుతి దాడులేనని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.