ArticlesNews

భగవంతుణ్ణే భువికి రప్పించిన బాలకుడు

4views

పుత్రవాత్సల్యంతో కుమిలిపోయే తండ్రి, భక్తి పారవశ్యంలో మునిగిపోయిన కుమారుడు.. వీరిద్దరి నడుమ నలిగిపోయిన తల్లి. ఈ నేపథ్యంలో.. ధర్మాన్ని రక్షించి దుర్మార్గాన్ని శిక్షించిన నరసింహావతారం. ఇది మానవాళికి ఒక మహత్తర సందేశం.

ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షితమైనట్లు నిరంతరం శ్రీహరి ధ్యానంలోనే నిమగ్నమయ్యాడు ప్రహ్లాదుడు. ఎనలేని భక్తితో భగవంతుని కృపను పొందగలిగిన విశిష్ట బాలకుడతడు. తల్లి గర్భంలో ఉండగానే నారదముని ఉపదేశాలు విని శ్రీహరి భక్తుడిగా మారిన కారణజన్ముడు ప్రహ్లాదుడు.

అనేకమార్గాల ద్వారా తనకు మరణం లేకుండా వరం పొందిన దానవరాజు హిరణ్యకశిపుడి పుత్రుడు ప్రహ్లాదుడు. ‘సద్గుణంబులెల్ల సంఘమై వచ్చి అసుర రాజ తనయునందు నిలిచె…’ అని వర్ణించాడు కవీశ్వరుడు. పెద్దల పట్ల వినయం, సమస్త ప్రాణులను తన వలెనే భావించే సహానుభూతి, పర స్త్రీలను మాతృభావనతో చూడగలగడం, దీనులకు సాయం చేయడం, మాటవరసకు కూడా అసత్యం పలకకుండా ఉండటం- ఇలా బాల్యంలోనే ప్రహ్లాదుడికి అనేక సద్గుణాలు అలవడ్డాయి. ప్రపంచమంతా విష్ణుమయమే అనే భావనను మాతృగర్భం నుంచే ఏర్పరచుకుని వినయం, కరుణ, వివేకం, దయ వంటి దైవిక గుణాలకు నివాస స్థానమయ్యాడు ప్రహ్లాదుడు. రాజాజ్ఞతో భటులు తనను సంహరించాలి- అనుకున్నప్పుడు కూడా భయపడి తల్లి వద్దకు పరుగెత్తి తప్పించుకోలేదు, దుఃఖించలేదు. అంతులేని ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించి, శ్రీహరినే నమ్ముకున్న భక్తుడు ప్రహ్లాదుడు. ‘సర్వ లోకాలను జయించగలిగావు గానీ నీలో ఉన్న అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.. అనే శత్రువులను సంసార బంధం మీది మమకారంతో జయించ లేకపోయావు తండ్రీ’ అని తన జనకుడి బలహీనతను సున్నితంగా తెలియజేసిన వివేకి. హిరణ్యకశిపుని వధించిన భీకరమైన నృసింహావతారంలో ఉన్న శ్రీహరిని తన ప్రార్థనలతో శాంతింపజేసిన సహనశీలి. మంచి చెడుల మధ్యన విచక్షణతో ప్రాణాలకు తెగించి, మంచి వైపే నిలిచిన ధీరత్వం ప్రహ్లాదుడిది.