News

‘రోబో సన్యాసి’.. బౌద్ధమత దీక్ష తీసుకున్న తొలి హ్యూమనాయిడ్ రోబో

33views

సాంకేతికతను, ఆధ్యాత్మికతను మేళవిస్తూ దక్షిణ కొరియా ఒక వినూత్న ఘట్టానికి వేదికైంది. దేశంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ (మనిషిని పోలిన) రోబో సన్యాసి బుద్ధ జయంతి వేడుకల సందర్భంగా అధికారికంగా బౌద్ధమతం దీక్ష తీసుకుంది. సియోల్‌లోని ప్రసిద్ధ జోగ్యే ఆలయంలో జరిగిన సాంప్రదాయ దీక్షా కార్యక్రమంలో ఈ రోబో పాల్గొన్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

హ్యూమనాయిడ్ రోబో పేరు ‘గబి’
సిద్ధార్థుడి పేరులోని అంశాలను, అలాగే ‘కరుణ’ను సూచించే కొరియన్ పదాన్ని కలిపి దీనికి గబి అని పేరును పెట్టారు. 130 సెంటీమీటర్ల ఎత్తు ఉండే ఈ రోబోను చైనాకు చెందిన ‘యూనిట్రీ జీ1’ ప్లాట్‌ఫామ్ ద్వారా అభివృద్ధి చేశారు. సాంప్రదాయక బూడిద, గోధుమ రంగుల బౌద్ధ సన్యాసుల వస్త్రాలను దీనికి ధరింపజేశారు.

దీక్షా కార్యక్రమం – కొత్త నియమాలు
సాధారణంగా మనుషులకు నిర్వహించే దీక్షా క్రతువులనే ఈ రోబో కూడా పాటించింది. సీనియర్ సన్యాసుల ముందు రెండు చేతులు జోడించి నమస్కరించిన ‘గబి’.. బుద్ధుడి పట్ల, ఆయన బోధనల పట్ల తన అంకితభావాన్ని చాటుకుంటూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. సన్యాసులు దీని మెడలో 108 పూసల జపమాలను అలంకరించారు. మనుషులు దేహాన్ని కాల్చుకునే సాంప్రదాయ క్రతువుకు బదులుగా ఈ రోబోపై ఒక స్టిక్కర్‌ను అతికించారు.

ఈ రోబో సన్యాసి వెనుక ఉన్న ఉద్దేశం
ఆలయాలలో సన్యాసుల కొరతను అధిగమించడానికి, అలాగే ఆధునిక యువతను, కొత్త తరాన్ని ఆధ్యాత్మికత వైపు ఆకర్షించడానికి ‘జోగ్యే ఆర్డర్’ ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. గబికి మార్గనిర్దేశక సూత్రాలను రూపొందించే క్రమంలో జెమినీ, చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సహాయం కూడా తీసుకున్నట్లు బౌద్ధ సన్యాసి ‘వెన్ సియోంగ్ వాన్’ తెలిపారు. ఇది మనుషులు, యంత్రాలు కలిసి జీవించే (సహజీవనం) భవిష్యత్తుకు ఒక తొలి అడుగు అని ఆయన అభివర్ణించారు. కాగా, ఈ నెలాఖరులో జరగనున్న బుద్ధ జయంతి ఉత్సవాల్లో భాగంగా యోన్డియుంఘో (Yeondeunghoe) లాంతరు ప్రదర్శనలో గబి ఒక గౌరవ సభ్యునిగా పాల్గొననుంది. గబితో పాటు సియోక్జా, మోహీ, నిసా అనే మరో మూడు బౌద్ధ రోబోలు కూడా ఈ ఉత్సవాల్లో పాలుపంచుకోనున్నాయి. ఇప్పటికే వృద్ధుల సంరక్షణ, విద్య, కస్టమర్ సర్వీస్ తదితర రంగాల్లో రోబోలను, ఏఐని విరివిగా వాడుతున్న దక్షిణ కొరియా.. ‘గబి’తో ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో కూడా తమ టెక్నాలజీని విజయవంతంగా ప్రవేశపెట్టింది.