
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచిపోయినా ఇంతవరకు తనతో వ్యక్తిగతంగా మాట్లాడకపోవడంపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారత ప్రధాని మోదీతో పలు సందర్భాల్లో సంభాషించిన బైడెన్ నుంచి తనకు కనీస పలకరింపు కరువైందన్న ఆవేదనతో ఇమ్రాన్ రగిలిపోతున్నట్లు పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసఫ్ మాటలను బట్టి తెలుస్తోంది. ‘అఫ్గానిస్థాన్ వ్యవహారంలో ఎంతో కీలకమైనది పాకిస్థాన్. అటువంటి దేశ ప్రధాన మంత్రితో అమెరికా అధ్యక్షుడు ఇంత వరకు మాట్లాడలేదు. ఇది ఎటువంటి సంకేతాలనిస్తుందో అవగాహన చేసుకోగలం. అమెరికా నాయకత్వం మమ్మల్ని ఇలాగే అశ్రద్ధ చేస్తుంటే మాకూ కొన్ని మార్గాలు ఉంటాయి’ అని మొయీద్ యూసఫ్ ‘ది ఫైనాన్షియల్ టైమ్స్ ఆఫ్ లండన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారని పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రిక వెల్లడించింది.
‘అధ్యక్ష భవనం నుంచి ఫోన్ కాల్ వస్తుందని ఎప్పటికప్పుడు అమెరికా అధికారులు చెబుతున్నారు. అది సాంకేతిక సమస్యో మరోదో కానీ నమ్మశక్యం కావడం లేదు. ఫోన్ కాల్ రావడమే ప్రత్యేక సదుపాయం అయితే, రక్షణ బంధం కూడా ప్రత్యేక సదుపాయమే. పాకిస్థాన్‌కూ ప్రత్యామ్నాయాలు ఉంటాయి’ అని మొయీద్ యూసఫ్ నిష్టూరమాడినట్లు డాన్ వార్తా కథనం పేర్కొంది. ‘అఫ్గానిస్థాన్ శాంతి ప్రక్రియలో ఇస్లామాబాద్‌కు కీలకమైన పాత్ర ఉందని అమెరికా అంగీకరిస్తుంది. తాలిబన్లను నిలువరించడానికి పాకిస్థాన్ సహాయాన్నీ కోరుతుంది. అయినా ఇమ్రాన్ ఖాన్‌తో బైడెన్ ఎందుకు మాట్లాడరు?’ అన్నది పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న ఫిర్యాదు. చైనాతో పాకిస్థాన్ గట్టి సంబంధాలను కొనసాగించడం బైడెన్‌కు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. అయితే, అమెరికా అధికారులు మాత్రం..బైడెన్ ఇంకా అనేక దేశాల నేతలతో మాట్లాడాల్సి ఉందని, త్వరలోనే ఇమ్రాన్ ఖాన్‌కూ ఫోన్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.





