
-
హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు
-
అరెస్టులు చేస్తే ప్రతిఘటిస్తాం… హిందూ సంస్థల హెచ్చరిక
నెల్లూరు: అనాదిగా వస్తున్న హిందువుల పండగలపై కక్షబూని, లేనిపోని నిబంధనలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అరెస్టులు పేరిట అరాచకాలు సృష్టిస్తే ప్రతిఘటిస్తామని హిందూ సంఘాలు హెచ్చరించాయి. ఈ నెల పదోతేదీన జరుపతలపెట్టిన వినాయక చవితి ఉత్సవాలపై కొవిడ్ పేరిట ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో గణేష్ భక్తులు, హిందూ సంఘాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎప్పడూ లేని జీవోలు జగన్ సర్కారు జారీ చేయడంపై నెల్లూరులో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగానే శ్రీ తిప్పరాజు వెంకట సబ్బయ్య కళ్యాణ సదన్ నుంచి వినాయక విగ్రహాలతో భక్తులు, హిందూ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కలెక్టర్ వరకు సాగింది. ఈ సందర్భంగా హిందూ సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, అభ్యున్నతిని కోరుకోవాలని, వీటిని పక్కనపెట్టి హిందువులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని దుమ్మెత్తిపోశారు.
చిరకాలంగా ఉన్న వినాయక చవితి ఉత్సవాలపై కొవిడ్ పేరిట కొత్త నిబంధనలు అమలు చేస్తే ఊరుకునేది లేదని, మండలపాల్లో పూజలు జరుపుకొనే హక్కు హిందువులకు ఉందన్న సంగతి ప్రభుత్వం తెలుసుకోవాలని ఘాటుగా అన్నారు.

సినిమా హాళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలు, సంతలు, బజారులు, రాజకీయ సభలు… వీటికి లేని అనుమతులు, ఆంక్షలు కేవలం హిందూ పండగలపై అమలు చేయడం చూస్తుంటే ప్రభుత్వానికి హిందువుల పట్ల చులకనభావం ఉందన్న విషయం స్పష్టమవుతోందన్నారు. పూజలు పేరిట హిందువులు ఇళ్ళ నుంచి వీధుల్లోకి వస్తే అరెస్టులు చేస్తామని జీవో జారీచేయడం హిట్లర్‌ను తలపించేలా ఉందని హిందూ సంఘాల నేతలు నిప్పులు చెరిగారు.
ప్రభుత్వం ఏ నిబంధనలు అమలు చేసినా, చేయకపోయినా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, తాము మండపాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఖాయమని అన్నారు. పూజలకు అడ్డుతగిలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్థానిక గణేష్ ఉత్సవ కమిటీ, విశ్వహిందూ పరిషత్, తదితర హిందూ సంఘాలు హెచ్చరించాయి.
Source: NDN News





