
టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశానికి మరో స్వర్ణం పతకం వరించింది. ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. తాజాగా బ్యాడ్మింటెన్ విభాగం నుంచి మరొకటి భారత్ ఖాతాలో పడింది. శనివారం సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో షట్లర్ ప్రమోద్ భగత్ ఘన విజయం కైవసం చేసుకున్నాడు. భగత్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెథెల్‌ను 21-14, 21-17 తేడాతో రెండు వరుసగా రెండు సెట్లల్లో 45 నిమిషాల్లో మట్టి కరిపించి, పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇదిలావుండగా, ఇదే విభాగంలో మనోజ్ సర్కార్ సైతం కాంస్య పతకాన్ని పట్టుకున్నాడు. మనోజ్ సర్కార్ జపాన్‌కు చెందిన డైసుకే ఫుజిహారాను 22-20 21-13 తేడాతో ఓడిరచి, కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. మొత్తం పతకాల సంఖ్య 17కు చేరింది. 4 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలతో పతకాల జాబితాలో భారత్ 25 వ స్థానానికి ఎగబాకింది. కాగా, ప్రమోద్ భగత్.. పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచాడు.
ట్విట్టర్‌లో ప్రధాని మోదీ శుభాకాంక్షలు
పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ సత్తాను లోకానికి చూపి, స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్‌లకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ అద్భుతమైన ఆటతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారంటూ కొనియాడారు.





