News

ప్లాట్ కొనుగోలుతో జీవితకాల తిరుమల వీఐపీ దర్శనం అంటూ ప్రచారం.. టీటీడీ ఖండన

3views

రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రచారంలో భాగంగా ‘ప్లాట్ కొనుగోలు చేస్తే జీవితకాలం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఉచితం’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఓ సంస్థ ప్రకటనను టీటీడీ తీవ్రంగా ఖండించింది.

తిరుపతి హైవే సమీపంలోని తమ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి తమ తరఫున ఉచితంగా వీవీఐపీ దర్శనం టికెట్ పాస్ అందిస్తామని పేర్కొంటూ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ రూపొందించిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రచారంపై భక్తుల్లో ఆందోళన వ్యక్తం కావడంతో టీటీడీ స్పందించింది.

శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఇటువంటి హామీలు ఇచ్చే అధికారం ఏ ప్రైవేటు సంస్థకు, వ్యక్తికి లేదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. వ్యాపార ప్రయోజనాల కోసం శ్రీవారి దర్శనం పేరును ఉపయోగించడం బాధ్యతారాహిత్యమైన చర్యగా పేర్కొన్నారు.

శ్రీవారి దర్శనాలు, సేవలు, టికెట్ల జారీ విధానం పూర్తిగా టీటీడీ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే కొనసాగుతుందని తెలిపారు. ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థలు టీటీడీ పేరు, శ్రీవారి పేరు వినియోగించి తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భక్తులు సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను పరిశీలించకుండా నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనాలకు సంబంధించిన అధికారిక సమాచారం టీటీడీ అధికారిక వెబ్‌సైట్, ప్రకటనలు, అధికారిక సోషల్ మీడియా వేదికల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. దర్శన టికెట్లను కూడా అధికారిక మార్గాల ద్వారానే పొందాలని సూచించింది.

ఇదిలా ఉండగా, సంబంధిత రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచురించిన ప్రకటనపై టీటీడీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు నేపథ్యంలో సంస్థ తన సోషల్ మీడియా ప్రచారాన్ని తొలగించినట్లు అధికారులు గుర్తించారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.