News

దేశంలో గణనీయంగా పెరిగిన కరోనా రికవరీ రేటు… తగ్గుతున్న కేసులు… ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు…

545views

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా నాలుగో రోజూ కొత్త కేసులు లక్షకు దిగువనే నమోదయ్యాయి. అలాగే 29 రోజులుగా రోజువారీ కేసుల కంటే రికవరీలే అధికంగా నమోదుకావడం ఊరటనిస్తోంది. ప్రభుత్వాలు విధించిన వైరస్‌ కట్టడి ఆంక్షలు ఫలితాన్నిస్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది.

తాజాగా 20,44,131 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 91,702 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసులు కొద్దిమేర తగ్గాయి. మొత్తం కేసుల సంఖ్య 2,92,74,823 చేరింది. తాజాగా మరోసారి 3వేలకు పైగా మరణాలు సంభవించాయి. నిన్న 3,403 మంది మృత్యు ఒడికి చేరుకోగా.. మొత్తం మరణాలు 3.6లక్షలకు పైబడ్డాయి. మహారాష్ట్ర మరణాల లెక్కను సవరించడంతో నిన్న ఈ పెరుగుదల కనిపించింది. ఆ రాష్ట్రంలో 1,915 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. క్రితం రోజు బిహార్ కూడా ఈ లెక్కను సవరించడంతో.. రికార్డు స్థాయిలో 6వేలకు పైగా మరణాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.

ఇక దేశంలో క్రియాశీల రేటు 4 శాతం దిగువకు చేరగా.. రికవరీ రేటు 95 శాతానికి చేరువైంది. నిన్న ఒక్కరోజే 1,34,580 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రెండుకోట్ల 70 లక్షల మందికిపైగా వైరస్‌ను జయించారు. ప్రస్తుతం 11 లక్షల మందికిపైగా కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోపక్క నిన్న 32,74,672 మంది టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 24,60,85,649కి చేరింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.