
అమెరికా దిగ్గజ కంపెనీల్లో ఒకటైన అప్లైడ్ మెటీరియల్స్ భారత్‌లో పరిశ్రమను నెలకొల్పేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల పరిశ్రమకు కావాల్సిన పరికరాలు, సేవలు, సాఫ్ట్‌వేర్‌ను అప్లైడ్ మెటీరియల్స్ అందిస్తుంటుంది. సెమీకండక్టర్ల తయారీలో ఉపయోగించే కొన్ని కీలక పరికరాలు, భాగాల తయారీ పరిశ్రమను భారత్‌లో నెలకొల్పాలని భావిస్తున్నట్లు సమాచారం.
17.2 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన అప్లైడ్ మెటీరియల్స్ భారత్‌లోకి ప్రవేశిస్తే.. సెమీకండర్ల పరిశ్రమకు భారత్‌ను కేంద్రంగా మార్చాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలకు ఊతం లభిస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న సంస్థ సరఫరా గొలుసులో భారత్ కూడా భాగమవుతుంది. అయితే, ఈ సంస్థ ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం’ కింద భారత్‌లోకి ప్రవేశిస్తుందా..? లేక స్వతంత్రంగానే రానుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
సెమీకండక్టర్ సహా ఇతర సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అలాగే భారత్‌లో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ‘ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)’ను కూడా విడుదల చేసింది. అంతర్జాతీయ సంస్థలతో పాటు దేశీయ కంపెనీలు కూడా ఇందులో పాల్గొనాలని ఆహ్వానించింది. అలాగే పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో కూడా తెలియజేయాలని కోరింది. ఒక బిలియన్ డాలర్ల ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం ఆసక్తి కూడా వ్యక్తం చేసింది.
వెంచర్ క్యాపిటల్ విభాగమైన అప్లైడ్ వెంచర్స్‌ను సైతం భారత్‌కు తెచ్చేందుకు అప్లైడ్ మెటీరియల్స్ సన్నాహాలు చేస్తోంది. భారత్‌లో పుట్టుకొస్తున్న సమర్థమైన అంకుర సంస్థల్ని గుర్తించి వాటికి దన్నుగా నిలవాలని యోచిస్తున్నట్లు భారత్‌లో సంస్థ సీటీఓ సూరజ్ రంగరాజ్ తెలిపారు.





