News

బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హంతకులకు రాజభోగాలు!

521views

కర్ణాటక: బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో నిందితులు కర్ణాటకలోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో రాజభోగాలు అనుభవిస్తున్నారు. వీరు మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ, వీడియో కాల్స్ చేస్తూ జల్సాలు చేస్తున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దీంతో హర్ష కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ తమకు ద్రోహం చేసిందని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ కేసులో నిందితులు ఈ జైలులో ప్రత్యేక భోగాలు అనుభవిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వీరి విలాసాలకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవడంతో జైలు అధికారులు సోదాలు నిర్వహించారు. వీరికి మొబైల్ ఫోన్లు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. వీరు ఎవరితో మాట్లాడుతున్నారు? సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు.

ప్రభుత్వ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని హర్ష సోదరి రజిని అన్నారు. మానవత్వం కరువైపోయిందని, ప్రాణ నష్టం జరిగిందని, న్యాయం చేయాలనే నిబద్ధత ఎవరికీ లేదని అన్నారు. ఎవరికీ పట్టనట్టు ఉందన్నారు. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ నిందితులు తమ భార్యలు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారన్నారు. వారికి అందరి మద్దతు లభిస్తోందన్నారు.

తాము తమ సోదరుడిని కోల్పోయామని, తాము బాధపడుతున్నామని చెప్పారు. జైలు అధికారులను సస్పెండ్ చేసి, తమకు న్యాయం చేయాలని కోరారు. నిందితులను ప్రత్యేకంగా చూస్తూ, వారికి రాజభోగాలను కల్పిస్తే, యువత తప్పుదోవపట్టడానికి ఓ ఉదాహరణ అవుతుందన్నారు. హత్య చేసినప్పటికీ, మూడు నెలల్లో బయటకు వచ్చేయవచ్చునని, అన్ని రకాల విలాసాలను అనుభవించవచ్చుననే సందేశం అందరికీ వెళ్తుందని చెప్పారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి