News

భారతీయ సంస్కృతిలో విద్వేషానికి చోటు లేదు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

475views

జేఎన్‌యూ: భారతీయ సంస్కృతిలో విద్వేషానికి ఎంత మాత్రమూ చోటు లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సమస్యలు, విరుద్ధ భావాలున్నప్పటికీ పరస్పర సమన్వయంతో కలిసి ముందుకు నడవడమే భారతీయ జీవన విధానమని చెప్పారు. కొన్ని విధ్వంసకర శక్తులు భారత దేశంలో అశాంతి రేకెత్తించేందుకు చేస్తున్న కుట్రలను అర్థం చేసుకుని వాటిని భగ్నం చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

ప్రజాస్వామ్యంలో తమ నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ఈ నిరసన ఆందోళనలను రేకెత్తించే విధంగా ఉండకూడదని ఆయన హితవు చెప్పారు. శాంతియుత వాతావరణంతోనే పురోగతి సాధ్యమవుతుందన్ని స్పష్టం చేశారు. జాతీయవాదం, దేశభద్రత అంశాల్లో రాజీపడాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు.

శుక్రవారం సాయంత్రం తనను కలిసిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) తెలుగు విద్యార్థులతో వెంకయ్య నాయుడు సంభాషించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇంత దూరం ఢిల్లీకి వచ్చిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ ప్రాంతంతో పాటు దేశానికి కూడా పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పుస్తకాల్లోని విజ్ఞానాన్ని పొందడంతో పాటుగా సృజనాత్మకమైన ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడంపై యువత దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పంచభూతాలను కాపాడినపుడే వాటినుంచి మనకు రక్షణ లభిస్తుందని ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవడంతో పాటు యోగా, ధ్యానాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి