News

జిన్నా టవర్ వ‌ద్ద జాతీయ జెండా ఆవిష్కరణ

662views

గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, గుంటూరులోని జిన్నా టవర్‌కు ఇటీవల త్రివర్ణ పతాక రంగులు వేయగా.. తాజాగా ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత జిన్నా టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ, గుంటూరులో జిన్నా టవర్‌కు చాలా ప్రత్యేకస్థానం ఉందని, జిన్నా టవర్ కట్టే సమయానికి ఇక్కడున్న వారిలో చాలామంది పుట్టి ఉండరని అన్నారు.

ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు అందరం స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నామని సుచరిత అన్నారు. భారతీయులందరూ ఒక్కటే అన్న భావనతో ప్రజలందరూ కలిసి మెలసి ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అంటూ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.

జిన్నా టవర్ పేరు మార్చాలి…

అంతకు ముందు కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ మాట్లాడుతూ దేశ గౌరవం కోసం జిన్నా టవర్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. జిన్నా టవర్ అంశం ముస్లింలు, హిందువుల కోసం కాదన్నారు. రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించే పని వైసీపీ చేస్తోందని ఆయన ఆరోపించారు. టవర్ పేరు మార్చకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని ఆయన హెచ్చరించారు.

దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. కానీ, గుంటూరులో మాత్రం విచిత్ర సంఘటనలు జరిగాయన్నారు. జిన్నా టవర్‌కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని తాము డిమాండ్ చేశామన్నారు. బీజేపీ డిమాండ్ మేరకు టవర్‌కు రంగులు మార్చారని, జాతీయ జెండా దిమ్మె పెట్టడం శుభపరిణామమన్నారు. జాతీయ జెండా రంగులు మన దేశానికి గర్వ కారణమన్నారు. మూడు రంగులు ఉన్న టవర్‌‌‌కు జిన్నా పేరు ఉండ‌డం దేశ ద్రోహమన్నారు. దేశ ప్రజలను తీవ్రంగా అవమానించినట్టేనన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి