
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనాను అక్కడి యోగీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దీంతో వైరస్ ప్రభావం నామమాత్రంగా ఉన్నది. 20 కోట్లకు పైగా జనాభా ఉన్న రాష్ట్రంలో గత 24 గంటల్లో ఒక్క కొవిడ్ మరణం కూడా నమోదుకాలేదు. కేవలం 11 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ప్రకటన మేరకు యూపీలోని కేవలం 199 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
సీఎం యోగి ఆధిత్యనాథ్ పాలనలోని రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లో 33 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క కోవిడ్ యాక్టివ్ కేసు కూడా లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లో 67 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదుకాలేదని తెలిపింది. ఆ రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 0.01 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.7 శాతంగా ఉన్నట్టు యూపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2.26 లక్షల శ్యాంపుల్స్ టెస్ట్ చేసినట్టు తెలిపింది. యూపీలో కొవిడ్ ప్రభావం నామమాత్రంగా మారడం పట్ల యోగి ఆదిత్యనాథ్ సర్కారు హర్షం వ్యక్తంచేస్తోంది.
రాష్ట్రంలో జోరుగా సాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ దీనికి కారణంగా అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో దాదాపు 7 కోట్ల మంది కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. శుక్రవారంనాడు (సెప్టెంబర్ 10న) అమెరికా కంటే ఎక్కువ సంఖ్యలో యూపీలో వ్యాక్సిన్లు ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. అమెరికాలో 8.07 లక్షల డోసుల వ్యాక్సిన్లు ఇవ్వగా.. యూపీలో 11.73 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చినట్టు వెల్లడిరచింది.





