(మార్చి 28 – జిల్లెళ్లమూడి అమ్మ జయంతి)
సమాజ సేవ ఈశ్వర సేవ, ఆ సేవలో వచ్చే తృప్తే ఆనందం. అదే ఐశ్వర్యం. అదే ముక్తి. ఇలా ఉపదేశాలు, సందేశాలు ఇవ్వడం కన్నా ఆచరణాత్మకమైన వైఖరే సమాజానికి మేలు చేస్తుంది. ఇదే విషయాన్ని నమ్మడమే కాదు ఆచరణలో పెడుతూ గుంటూరు జిల్లాలోని జిల్లెళ్లమూడిలో ‘అన్నపూర్ణాలయం’ స్థాపించి ఎందరో ఆకలిని తీరుస్తూ.. విశ్వజననిగా విఖ్యాతి పొందారు. ఆ మాతృమూర్తి పేరే ‘జిల్లెళ్లమూడి అమ్మ’. ఈవిడ అసలు పేరు అనసూయ. గుంటూరు జిల్లా పొన్నూరుకు దగ్గరలోని మన్నవ గ్రామంలో 28 మార్చి, 1923న సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక చింతనలో గడిపిన అనసూయకు 13వ ఏట తన మేనత్త కనకమ్మగారి పెద్ద కొడుకు బ్రహ్మాండం నాగేశ్వరరావుతో 1936 మే5న వివాహం జరిగింది. అనంతరం ఆ దంపతులు బాపట్లలో కాపురం పెట్టి 4 ఏళ్ల తర్వాత బాపట్లకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లెళ్లమూడికి చేరి అక్కడ స్థిరపడ్డారు. జిల్లెళ్లమూడి అమ్మగా వాసికెక్కారు.
ప్రపంచం అంతా ఒక్కటే ఒక్కడే దేవుడు అనేదే జిల్లెళ్లమూడి అమ్మ వేదాంత బోధ. అరవై సంవత్సరాల జీవన ప్రయాణంలో అమ్మ చేసిన అంకురార్పణలన్నీ విద్య, వైద్యం, సమాజ సేవ, సంప్రదాయ పునరుద్ధరణ, మానవతా వికాసం, వ్యక్తి పరిణామం, అధివాస్తవిక జీవన విధానం, జీవన్ముక్త స్థితులు, జీవకారుణ్యం, సమత్వం, సర్వత్రా ఆత్మదర్శనం తదితర మహోదాత్త భావనల చుట్టూనే ఉన్నాయి. అన్ని బాధల కన్నా ఆకలి బాధ భయంకరమైనది, దుర్భరమైనది. అన్నం దొరక్క ఎవరూ మరణించకూడదు అని అమ్మ వెలిగించిన పొయ్యి అరవయ్యేళ్లుగా అరకుండా వెలుగుతోంది. అది అమ్మ భావనా బలం. అదే భావం, అదే స్ఫూర్తి, అదే ఆదరణ, అదే ఆప్యాయలతో నేటికీ జిల్లెళ్లమూడిలో అన్నపూర్ణాలయంగా అది విలసిల్లుతోంది.
ముక్తికి సులభమైన మార్గాన్ని ఒక సందర్భంలో అమ్మ వివరిస్తూ, ‘‘పదిమంది కోసం పదిమందితో కలిసి పని చేయడం, అలాగే మమకారాన్ని చంపుకోకుండా పెంచుకోవడం, పరిమితంగా ఉన్న ప్రేమను విస్తృతం చేసుకోవడం..’’, ఇదే నేటి మానవ ధర్మమని ఉపదేశించారు. మానవుడు మాధవుడిగా మారేందుకు ఇదే సులువైన మార్గమని సందేశం ఇచ్చారు. అలాగే భారతీయ ధార్మిక జీవనానికి పునాది అయిన వైవాహిక వ్యవస్థ గురించి గురించి ఉపదేశిస్తూ, ‘కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా అర్పించడమే కళ్యాణం’, ‘ఒక పెన్నిధి అండన చేరడమే పెండ్లి’, అని వైవాహిక వ్యవస్థ గురించి స్పష్టమైన నిర్వచనాలను ప్రకటించారు.
వందేళ్ల క్రితం జగజ్జననీ చైతన్యం మానవదేహం ధరించి, స్త్రీ రూపం దాల్చి, మాతృభావాన్ని, భారాన్ని వహించి నేలపై నిలవడం ఒక ఆధ్యాత్మిక వసంతం. నాడు ప్రత్యక్షంగా ఎందరెందరినో ఆదుకున్న ఆదర హస్తం ఇప్పటికీ దివ్య స్పర్శగా..అమ్మ చేతలుగా అనుగ్రహిస్తూనే ఉంది. కన్నీళ్లను తుడుస్తూనే ఉంది. కడుపు నిండా అన్నం పెడుతూనే ఉంది. అవిద్యలో కూరుకుపోయినవారిని ప్రేమపూర్వకంగా చేరదీస్తూనే ఉంది. మానవతా పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంది. నిరతాన్నదాన మహాయజ్ఞకర్తగా…అమ్మ ఒక మానవతా మణిదీపం..





