
గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి స్వయం సహాయక సంఘాలు. ఉపాధి కల్పిస్తూనే వాళ్లల్లో ఆత్మస్థైర్యాన్నీ నింపుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని సెరిఖేడికి చెందిన కొందరు మహిళలు ‘జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్’లో చేరి కుట్టు పని చేస్తున్నారు. 2019లో దీన్ని మొదలుపెట్టినా తక్కువ సమయంలోనే ప్రజాధారణ పొందిందీ కేంద్రం. దాంతో పెద్దపెద్ద ఆర్డర్లు వరుస కట్టాయి. ఆరుగురు మహిళలతో నడిచే మెషీన్ సెంటర్‌లో కుట్టు, ఎంబ్రాయిడరీ వంటివి చేస్తుంటారు. అంతేకాదు, పాఠశాలలు, కళాశాలల యూనిఫామ్‌లను ఆర్డర్ల మేరకు కుట్టిస్తారు. వీటితోపాటు, సరిహద్దుల్లో పహారీ కాచే సైనికులూ, పోలీసులకు సైతం షర్టులు, బ్యాగులు వంటివి తయారుచేస్తారు. ఈ కేంద్రం పర్యవేక్షణ చూసేది కూడా ఆడవాళ్లే. ఆర్డర్లు పెరిగితే కేంద్రంలో పనిచేసే మహిళల సంఖ్య కూడా పెరుగుతుంటుంది. ‘ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని అక్కడికి వెళతాం. ఒకప్పుడు మా అవసరాల కోసం ఇంట్లో వాళ్లపై ఆధారపడేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మేం సంపాదిస్తున్నది మా కుటుంబాల పోషణకు కూడా సరిపోతోంది’ అంటారు ఈ కేంద్రంలో పనిచేసే కార్మికురాలు వేద్ కుమారి. ఇక్కడ వినియోగదారుల ఆర్డర్ల ప్రకారం వివిధ రకాలు… చీరలు, మాస్కులు, పీపీఈ కిట్లు, చిన్నారులకు దుస్తులు తయారుచేస్తారు. అంతేకాదు, కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్లకు కుట్టుపనిలో శిక్షణ కూడా ఇస్తున్నారు.





