
విద్యారణ్యులు జయంతి
భారతదేశం పరాయి పాలనలో మగ్గుతున్న కాలం. మతమార్పిడులు పెచ్చుమీరిన సమయం. ఒకరోజు మహారాజు హరిహరరాయలు తన పరివారంతో వేటకు బయల్దేరారు.
వారికి దారి చూపిస్తూ పరుగులు తీస్తున్న వేటకుక్కలపైకి హఠాత్తుగా పొదల్లోంచి కుందేళ్లు దూకి తరిమికొట్టసాగాయి. రాజు ఆశ్చర్యపోయాడు. ఎదురుగా శిష్యులతో వస్తున్న విద్యారణ్య స్వామి కనిపించారు. విరూపాక్ష స్వామిని సేవించుకొని ఆశ్రమానికి వెళ్తున్నట్టు తెలిసింది. ‘వేటకుక్కలపై కుందేళ్ల దాడి విచిత్రంగా ఉంది స్వామీ!’ అన్నాడు రాజు. బదులుగా విద్యారణ్యులు ‘నాయనా! ఇది వీరక్షేత్రం. నేలప్రభావం అలాంటిది. సాధుస్వభావులు కూడా వీరత్వం ప్రదర్శిస్తారు. ఇక్కడ మహానగరాన్ని నిర్మిస్తే వైభవంగా ఉంటుంది’ అన్నారు. అలా విద్యారణ్యుల ప్రోద్బలం, మార్గదర్శకత్వాలతో మహానగరం నిర్మితమైంది. వారు విజయనగర సామ్రాజ్యాన్ని విజయపథంలో నడిపించారు. విదేశీయులను కట్టడి చేయటంలో, మతమార్పిడులను అడ్డుకోవడంలో విద్యారణ్యులది ప్రముఖ పాత్ర.
మాధవాచార్యులే విద్యారణ్యులై…: ఓరుగల్లు వాసియైన మాధవాచార్యులు విద్యాభ్యాసం కోసం శృంగేరి చేరుకున్నారు. గురువు విద్యాతీర్థుల సూచనతో సన్యాసం స్వీకరించారు. విద్యారణ్య తీర్థ పేరుతో హంపిలోని తుంగభద్ర తీరాన విరూపాక్షుని సన్నిధిలో భువనేశ్వరీమాతను ధ్యానిస్తూ తపస్సు చేశారు. ‘నా దేశమాత కన్నీరు తుడవాలి. అధర్మాన్ని అణచాలి’ అని వేడుకోగా అమ్మవారు దీవించింది. ఆ తర్వాతే మార్గమధ్యంలో హరిహర రాయలు కలిశారు. విద్యారణ్యుల కృషితో విజయ నగరం పునఃప్రతిష్ఠితమై, విస్తరించింది. వైదిక ధర్మరక్షణ కోసం కంచి, శృంగేరి పీఠాలు చాలవని భావించారు విద్యారణ్యులు. ఆ పరంపరలో తెలుగునేలపై విరూపాక్ష, పుష్పగిరి; కర్ణాటకలో శివగంగ, ఆమని; మహారాష్ట్రలో సంకేశ్వరం, కొల్హాపురీల్లో పీఠాలు స్థాపించారు.
సమాజ శ్రేయస్సే ముఖ్యం: విద్యారణ్య స్వామి ఎందరికో జ్ఞానభిక్ష పెట్టారు. ప్రలోభాలతో మతం మారినవారికి హితవుచెప్పి తిరిగి హిందువులుగా మార్చారు. కుటుంబం కంటే సమాజ శ్రేయస్సే ప్రధానమని విశ్వసించారు విద్యారణ్యులు. తుది శ్వాస విడిచేవరకూ ధర్మోద్ధరణ, దేశోద్ధరణలకే అంకితమయ్యారు. సామాన్యులకూ అర్థమయ్యేలా వేదాలకు భాష్యం రాశారు. చంద్ర శేఖర భారతీ స్వామి వంటి ఆధ్యాత్మికవేత్తలకు దీక్షనిచ్చి ముందుకు నడిపారు. హంపిలో విరూపాక్ష ఆలయం సమీపాన విద్యారణ్యుల సమాధి నేటికీ భక్తులను తరింపచేస్తోంది
బి.సైదులు





