ArticlesNews

భక్తి, ముక్తి, సామాజిక సేవా దృక్పథాల కలయిక వైశాఖం

6views

అక్షయ తృతీయ

గంగానదితో సమానమైన పుణ్యతీర్థం లేనట్టే వైశాఖంతో సమానమైన మాసం లేదన్నది రుషివాక్యం. ఇది మాధవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాలు అనంతమైన ఫలితాలను ఇస్తాయని స్కాంద పురాణం తెలియజేసింది. 

వసంత రుతువులో వచ్చే వైశాఖం భక్తి, ముక్తి, సామాజిక సేవా దృక్పథాల కలయిక. సూర్యుడు మేషరాశిలో సంచరించే ఈ కాలంలో ఆధ్యాత్మిక సాధనతో పాటు పరోపకారమూ ముఖ్యమే.

విశాఖ నక్షత్రం నుంచి వైశాఖం వచ్చింది. విశాఖ అంటే శాఖలు లేనిది, విశిష్టమైన కాంతి అనే అర్థాలున్నాయి. ఆధ్యాత్మికంగా ఏకాగ్రతను, భక్తిని సూచించే ఈ మాసాన్ని ‘మాధవ మాసం’ అని కూడా అంటారు. మాధవుడంటే విష్ణువు. ఈ మాసంలో ప్రత్యేకించి విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. వైశాఖంలో వచ్చే ప్రతి పండుగ వెనుక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది.

అక్షయ తృతీయ.. పురాణాల ప్రకారం- కృతయుగం ఆరంభమైంది, వేదవ్యాసుడు మహాభారత రచనను ప్రారంభించింది ఈ రోజే. గంగానది దివి నుంచి భువికి దిగి వచ్చిన రోజుగానూ దీనికి గుర్తింపు ఉంది. ఈ రోజు చేసే దానధర్మాలు, జపతపాలు అక్షయమై, గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం సంప్రదాయంగా మారినప్పటికీ.. శాస్త్రం ప్రకారం ఈ రోజు అన్నదానం, నీటి కుండను దానం చేయడం శ్రేష్ఠమన్నది పెద్దల మాట.

అద్వైత సిద్ధాంత కర్త, సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన మహాత్ముడు జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వైశాఖ శుద్ధ పంచమి. జ్ఞాన సముపార్జన చేసేవారికి ఇది కీలకం. వైశాఖ శుద్ధ సప్తమి గంగా సప్తమి. జహ్ను మహర్షి చెవి నుంచి గంగ పునర్జన్మ పొందిన రోజు కాబట్టి దీనిని ‘జహ్ను సప్తమి’ అని కూడా అంటారు. ఈ రోజు గంగా స్నానం, గంగా పూజ విశేష ఫలితాలను ఇస్తాయి.

మోహిని అవతరించిన రోజు: వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిని ఏకాదశి. క్షీరసాగర మథనం సమయంలో అమృతాన్ని అసురుల నుంచి రక్షించడానికి విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించిన రోజిది. ఏకాదశి వ్రతాన్ని చిత్తశుద్ధితో ఆచరిస్తే పాపాలు తొలగి, మనశ్శాంతి లభిస్తుందని నమ్మకం. వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం విష్ణుమూర్తి నరసింహ స్వామిగా అవతరించిన పవిత్ర తిథి ఇది. స్వామి కరుణాకటాక్షాల కోసం ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి నృసింహ స్తోత్రాలను పఠిస్తారు.
వైశాఖంలో పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తింది ఈ పౌర్ణమినాడే. గౌతమ బుద్ధుడు జన్మించింది, జ్ఞానోదయం పొందింది, నిర్యాణం చెందింది కూడా వైశాఖ పౌర్ణమి నాడే. అందుకే ఈ మాసాన్ని ‘మహావైశాఖి’ అని కూడా పిలుస్తారు. శాంతి, అహింసల ప్రాముఖ్యతను గుర్తుచేస్తుందీ రోజు. వైశాఖం భక్తికి, ముక్తికి మాత్రమే పరిమితం కాదు, దీని వెనుక సామాజిక అవసరాలు, ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి.

జలదానం జీవకారుణ్యం: ఎండలు తీవ్రంగా ఉండే వైశాఖంలో చలివేంద్రాలు ఏర్పాటుచేయడం, బాటసారులకు నీటిని అందించడం పుణ్యకార్యంగా ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేశాయి. ‘ఉదకకుంభ దానం’ అంటే నీటితో నిండిన కుండను దానం చేయడం ఈ మాసంలో విశేషం. ఇది సమాజంలో పరస్పర సహకారాన్ని, సాయపడే గుణాన్ని పెంచుతుంది.

ఆహార నియమాలు: వసంతకాలం ముగిసి గ్రీష్మ రుతువు ప్రవేశించే సంధి కాలం వైశాఖం. శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఈ మాసంలో పెరుగన్నం, పానకం, మజ్జిగ సేవించడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు చెబుతారు. ఆధ్యాత్మిక నియమాల పేరుతో పాటించే ఈ సూత్రాలు వాస్తవానికి ఆరోగ్య సంరక్షణ కోసమే.

వైశాఖంలో వృక్షాలను పూజించడం, నీడను ఇచ్చే చెట్లను నాటడం పుణ్యప్రదంగా భావిస్తారు. ప్రకృతిని ప్రేమించడం, పశుపక్ష్యాదులకు దాహం తీర్చడం వంటివి ఈ మాసపు విధులలో భాగంగా ఉన్నాయి. ఇవన్నీ పుణ్యకార్యాల పేరుతో సామాజిక రక్షణకు, పర్యావరణ సమతౌల్యతకు తోడ్పడతాయి.

వైశాఖంలో ఎండ తీవ్రతను తట్టుకుంటూ ఆధ్యాత్మికత వైపు మనసును మళ్లించడం అంటే ఇంద్రియనిగ్రహాన్ని సాధించడమే. అక్షయ తృతీయ నాడు ప్రారంభమయ్యే ఈ పవిత్ర ప్రయాణం, బుద్ధ పూర్ణిమ నాటి శాంతి సందేశంతో ముగుస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటూనే.. ప్రకృతిని కాపాడటం, బాటసారులకు నీరు అందించడం వంటి సేవ చేద్దాం. అంతకంటే పుణ్యప్రదం ఇంకేముంటుంది?!