
సాధారణంగా చాలామంది ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందించే శిక్షణకు వెళ్లి వివిధ పనులు నేర్చుకుంటారు. కానీ సర్టిఫికెట్ తీసుకున్నాక ఆ విషయాన్నే మర్చిపోతారు. కానీ తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన ఓ మహిళ మాత్రం కొబ్బరి పీచుతో వివిధ వస్తువుల తయారీలో శిక్షణ పొంది పరిశ్రమను ఏర్పాటు చేశారు. తానూ సంపాదించడమే కాక మరో పదిమందికి ఉపాధిని కల్పిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కడియంలో నర్సరీలు, మొక్కలు విక్రయాల ద్వారా ఉపాధి పొందుతుంటారు. కానీ కొబ్బరి పీచుతో అరుదైన, అందమైన బొమ్మలు, డోర్ మ్యాట్లు, తాళ్లు తయారీ పరిశ్రమ స్థాపించి రాణిస్తున్నారు అల్లం గౌతమి అనే మహిళ. అంతేకాదు పదిమందికి ఉపాధి కల్పించి అందరితో శభాష్ అనిపించుకుంటుండటం విశేషం.
తనతో పాటు మరో పదిమందికి ఉపాధి: గౌతమి ఐదేళ్ల క్రితం ధవళేశ్వరంలోని కాయర్ బోర్డులో కేంద్ర ప్రభుత్వం అందించిన కొబ్బరి పీచుతో వివిధ వస్తువుల తయారీ శిక్షణ పొందారు. ఆ సమయంలో ఆమె ఆసక్తి, ప్రతిభను చూసిన నిర్వాహకులు మహిళలకు శిక్షకురాలిగా నియమించారు. గౌతమి ఓ వైపు శిక్షణ పొందుతూనే మరోవైపు సొంతంగా కడియంలోని భాస్కర్ నగర్‌లో పరిశ్రమను ఏర్పాటు చేశారు. కష్ట నష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని పరిశ్రమను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. డోర్ మ్యాట్లు, తాళ్లు, బొమ్మల తయారీకి ముడి సరకు కోనసీమ నుంచి తెప్పిస్తున్నట్లు గౌతమి ఈ సందర్భంగా తెలిపారు. తయారు చేసిన తర్వాత వాటిని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు ఆమె చెప్పారు.
ఈ కొబ్బరి పీచు పరిశ్రమలో మహిళలతో పాటు ఇద్దరు పురుషులు కూడా మార్కెటింగ్ ద్వారా ఉపాధిని పొందుతున్నారు. ఇక్కడ తయారు చేస్తున్న వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుందని పరిశ్రమలో పనిచేసే మహిళలంతా చెబుతున్నారు. అయితే మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే మరింత ఆదాయం సమకూరుతుందని వీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
“నేను ఐదేళ్ల క్రితం ధవళేశ్వరంలోని కాయర్ బోర్డులో కేంద్ర ప్రభుత్వం అందించిన కొబ్బరి పీచుతో వివిధ వస్తువుల తయారీ శిక్షణ పొందాను. ఆ సమయంలో నా ఆసక్తి, ప్రతిభను చూసిన నిర్వాహకులు నన్ను శిక్షకురాలిగా నియమించారు. ఆ తర్వాత ఓ వైపు శిక్షణ పొందుతూనే మరోవైపు సొంతంగా కడియంలోని భాస్కర్ నగర్‌లో పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నాను. ఈ క్రమంలో పరిశ్రమలో కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనా తోటిమహిళల సహకారంతో ధైర్యంగా ఎదుర్కొని పరిశ్రమను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాను. డోర్ మ్యాట్లు, తాళ్లు, బొమ్మల తయారీకి ముడి సరకు కోనసీమ నుంచి తెప్పిస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే మరింత మందికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు దొహదపడుతుంది.”
-అల్లం గౌతమి, పరిశ్రమ యజమాని
“మహిళలుగా మేం ఇంటికే పరిమితమై ఉంటున్నామని, మాకు ఉపాధిని కల్పించే ఉద్దేశంతో పరిశ్రమ యజమాని అల్లం గౌతమి బ్యాంకు వద్ద రుణం తీసుకుని మరీ ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. గౌతమి ద్వారా దాదాపు 20 మంది మహిళలు శిక్షణ తీసుకున్నాం. ప్రస్తుతం మాకు రోజుకు రూ. 250 వరకు జీతం ఇస్తున్నారు. భవిష్యత్తులో పరిశ్రమ అభివృద్ధి ఆధారంగా మరింతగా పెంచుతామన్నారు. ఈ పరిశ్రమ ఆర్థికంగా మాకెంతో భరోసా నిస్తోంది.”
– కొబ్బరి పీచు పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు





