
నటుడు ప్రకాశ్‌రాజ్ హిందువుల ఆరాధ్య దైవమైన రాముడు, అత్యంత పవిత్రంగా భావించే రామాయణాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ప్రకాశ్‌రాజ్‌పై పరువు నష్టం దావా వేసి, లీగల్ నోటీసులు పంపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలు చేశారని నోటీసులో వెల్లడించారు.
సీతారామలక్ష్మణులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ వెంటనే హిందువులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. వారంలో క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. బహిరంగ వేదికపై విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రకాశ్‌రాజ్ ఉద్దేశపూర్వకంగా రామలక్ష్మణులపై వ్యాఖ్యలు చేశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘తక్షణమే హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. సినిమాల్లో డైలాగులు చెప్పినట్లు, యాక్టింగ్ చేసినట్లు దేవుళ్లపై మాట్లాడితే చూస్తూ ఊరుకోం. ప్రకాష్ రాజ్‌కు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపాం. హిందువుల తరపున రూ.100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయడంతో పాటు, ఆయనపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం.’
– భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు
ప్రకాశ్‌రాజ్ చేసిన కామెంట్లు: ఇటీవల కేరళలో జరిగిన కార్యక్రమంలో సీతారామలక్ష్మణులపై ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఓ ఇంటర్వూలో తాజా రాజకీయ పరిస్థితులను ఉద్దేశించి ప్రకాశ్‌రాజ్ మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఉదాహరణగా రామాయణాన్ని తీసుకుని చెప్తున్నట్లుగా వివరిస్తూ రాముడు ఉత్తరాదికి చెందిన వాడని, అక్కడ నుంచి దక్షిణాదికి వలస వెళ్లిన వలస కూలీ అని చెప్తూ వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సైతం ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టడం గమనార్హం.
హీటెక్కిన హిందూ సంఘాలు: కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారిన విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ గతంలోనూ అనేక సందర్భాల్లో హిందూ, సనాతన ధర్మాలకు వ్యతిరేఖంగా కామెంట్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. హిందువులు అత్యంత పవిత్రంగా కొలిచే దైవం రాముడిపై ప్రకాశ్‌రాజ్ చేసిన తాజా వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అనేక మంది మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.





