(మార్చి 28 – ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి)
ధర్మ ప్రతిష్టాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వమే ధ్యేయంగా జీవించి ధన్యుడైన వారిలో నిత్యస్మరణీయుడు ఛత్రపతి శివాజీ. అందుకే శివాజీ ‘స్వరూపాన్నే ధ్యానించండి, ఆయన ప్రతాపాన్నే అనుష్ఠించండి’ అని సమర్థ రామదాసు వంటి మహనీయులు మన జాతికి ప్రబోధించారు. హిందూ ధ్వజాన్ని మళ్ళీ ఉత్తుంగ శిఖరాలపై ఎగురవేసి, హిందూత్వంలో అమృతాన్ని నింపి ప్రాణప్రతిష్ఠ చేసిన మహనీయుడు శివాజీ. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, మధ్య యుగంలో హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన మహోన్నత వీరుడు శివాజీ.
హైందవ సామ్రాజ్య నిర్మాత అయిన శివాజీ 1630వ సంవత్సరం వైశాఖమాసపు శుక్ల పక్ష తదియ నాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో శహాజీ, జిజియాబాయి పుణ్య దంపతులకు జన్మించాడు. తిథి ప్రకారం ఈ ఏడాది మార్చ్ 28న శివాజీ మహారాజ్ జయంతిని జరుపుకుంటున్నాము. దేశభక్తిని ఉగ్గుపాలతోనే రంగరించుకున్న శివాజీ తన తల్లి జిజియాబాయి పెంపకంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు. ‘రామ రామరాజ్యం వంటి హైందవ సామ్రాజ్యం నిర్మాణం చేయాలనే కోరిక’ శివాజీలో బాల్యంలోనే స్థిర పడింది. తల్లి సంరక్షణ, దాదాజీ ఖాండ్‌దేవ్ శిక్షణతో శివాజీ వీరుడిగా అవతరించారు. భారత రామాయణాల విశిష్టత, హిందూ మతం గొప్పదనం తల్లిద్వారా నేర్చుకున్నాడు. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం కూడా ఆమె ద్వారా పెంపొందించుకున్నాడు. తండ్రి పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో యుద్ధ తంత్రంలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యా పారంగ తుడైన శివాజీ, మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహారచన చేశాడు.
హిందూ సమాజంపై ఎక్కడ దాడి జరిగినా నేనున్నానంటూ అభయం కల్పించిన వీరుడు శివాజీ. ఛత్రపతి శివాజీ వేసిన ప్రతి అడుగు హైందవ సమాజ ఔన్నత్యానికే అనేది సత్యం. వెన్ను చూపని ఆయన పోరాటంలో కుటుంబాన్ని కోల్పోయాడు. నలుగురు భార్యలతో పాటు కుమారుడు శంభాజీ కూడా తనువు చాలించాడు. శివాజీ మరణానంతరం మతం మారాలని శివాజీ కొడుకు శంబాజీని తలకిందులుగా వేలాడదీసి గోళ్లు నరికి చర్మం వలిచినా హిందూ మతాన్ని ఆయన వీడలేదు. అందుకే వారి త్యాగాలు హిందూ సమాజానికి సదా ఆదర్శం.
తన రాజ్యంలో అన్ని మతాలకు స్థానం కల్పించి అందరి విశ్వాసాలు గౌరవించేవారు శివాజీ మహారాజు. కానీ మొగలాయిల రాజ్యంలో ఎటు చూసినా హైందవ ఆడ జాతిపై సాగుతున్న రాక్షసత్వానికి బదులు తీసుకోవాలని ఆలోచన ఏరోజూ ఆయన మదిలో ఉండేది కాదు. కొంతమంది తన సైనికులు ముస్లిం యువతిని తీసుకువచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని చూసారు. వారిని తీవ్రంగా మందలించి పరాయి మహిళ ఏ మతస్తురాలైనా తల్లితో సమానమని బోధించాడు. ఏ రోజూ కూడా ఇతర మతస్తులపై ఆధిపత్యం, కక్ష సాధింపులు చేయని సమధర్మ వాది ఛత్రపతి.
హిందూ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలను కాలరాసి క్రూరంగా మతమార్పిడులకు పాల్పడుతున్న మొగల్ రాజుల మెడలు వంచిన వీరుడు శివాజీ. కంటికి కన్ను పంటికి పన్ను అనే రీతిలో శత్రువులకు బుద్ధి చెప్పి హైందవ సమాజాన్ని రక్షించుకున్న ధీరుడు ఆయన. చుట్టూ విస్తరించి ఉన్న మొగలులను ఎదిరించే క్రమంలో చతురత ప్రదర్శించాడు. సైన్యం తక్కువగా ఉండటంతో గెరిల్లా యుద్ధం చేసి శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించాడు. విజయమో వీర స్వర్గమో అంటూ తన సైన్యంలోని ప్రతి ఒక్కరిని మానసికంగా సంసిద్ధులను చేసి.. ధర్మరక్షణలో వెన్నుచూపని వీరులుగా తీర్చిదిద్దాడు. అరచేతిలో ప్రాణాలను పట్టుకొని జీవిస్తున్న హైందవ జాతిని కంటికి రెప్పలా కాపాడాడు. రాజ తంత్రం ఉపయోగించి శత్రువుల కంటిమీద కునుకు లేకుండా చేశాడు.
హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి హైందవ జాతిని జాగృతం చేసిన శివాజీ జీవితమే ప్రేరణగా, ఆయన చూపిన మార్గమే బాటగా, హిందూ సంఘటన తద్వారా భారతదేశ పునర్వైభవ సాధన అనేది డాక్టర్జీ స్వప్పం. అది సాకారమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ దిశగా నేడు భారతావని అడుగులు వేస్తోంది. చారిత్రాత్మకమైన ఈ దివ్యదృశ్యాన్ని మన కళ్లతో చూసే అదృష్టం లభించడం, భారతదేశాన్ని తిరిగి విశ్వ గురువుగా దర్శించే భాగ్యం పొందడం ఆనంద దాయకం. ఈ పనిలో మనమంతా భాగస్వాములయ్యేందుకు కావల్సిన శక్తి సామర్థ్యాలు పెంచుకునేందుకు కృషి చేద్దాం.





