(మార్చి 28 – ముమ్మిడివరం బాలయోగీ వర్ధంతి )
పురాతన భారతీయ యోగభూమి ఎందరో మహర్షులకు, యోగులకు పుట్టినిల్లు. పురాతన, ఆధునిక యోగుల సంప్రదాయంలో తపస్సు, ధ్యానం ద్వారా తపోసిద్ధి పొంది ఎందరో భక్తులకు జ్ఞానగీతిని అందించిన మహనీయులలో ముమ్మిడివరం బాలయోగీశ్వరులు ఒకరు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు నిరాహారంగా తపస్సులో ధ్యానంలో మునిగి భక్తులపై కరుణాకటాక్షాలు ప్రసరింపచేసిన భగవాన్ బాలయోగీశ్వరుల చరిత్ర ఆధ్యాత్మిక పరంపరలో ఓ అరుదైన ఘట్టం.
కోనసీమలోని ముమ్మిడివరం గ్రామంలో కటికదల గంగయ్య, రామమ్మ అనే పేద దళిత కుటుంబం ఇంట 23 అక్టోబర్ 1930న మూడో సంతానంగా బాలయోగీశ్వరులు జన్మించారు. వారి పూర్వపు నామం సుబ్బారావు. గోవుల కాపరిగా కుమారుడిని గంగయ్య పనిలో చేరిస్తే ఆయన ధ్యాసంతా పూర్వజన్మ వాసనల ఫలితంగా తపస్సు వైపు మరలింది. సుబ్బారావు తన 16వ యేట కృష్ణుడు, నారదుడు ఫొటోతో దగ్గరలోని కొబ్బరి తోటలో యోగముద్రలో ధ్యానం చేసుకుంటూ గడిపారు. కాలక్రమంలో బాలయోగీశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు. ముక్తిని పొందడానికి, జ్ఞానం పొందడానికి సాధన అవసరమని భావించిన బాలయోగీశ్వరులు సుమారు నాలుగు దశాబ్దాల పాటు మౌనముద్రలోనే దాదాపు గడిపారు. ధ్యాన సమాధిస్థితిలో మౌనాన్నే సంకేతంగా చేస్తూ భక్తుల్లో జ్ఞాన తృష్ణను మేల్కొల్పారు.
నలభై యేండ్లు మౌనముద్రలో ఉంటూ అపుడపుడు మాత్రమే భక్తుల విన్నపం మేరకు మౌనం వీడేవారు బాలయోగీశ్వరులు. ఈశ్వర తత్వ ప్రతీ కగా నీరాజనాలు అందుకున్న స్వామివారిని దర్శించుకొనేందుకు 1984-85 దశకంలో సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులు, విదేశీ భక్తులు ముమ్మిడివరం విచ్చేసేవారు. ‘‘భగవంతుడిని ధ్యానించడానికి అరణ్యం వెళ్లనవసరం లేదని. తానెవ్వరో తెలుసుకొని చలించే మనస్సును కట్టిబెట్టగలిగితే తన ఆత్మ తన గురువగును,” అని బోధించేవారు.
భగవత్ తత్వాన్ని అన్వేషిస్తూ యోగవిద్యను వశపర్చుకొని అష్టాంగయోగం ద్వారా అనితర తపస్సుతో ధ్యాన సమాధిలోనికి వెళ్లిన బాలయోగీశ్వరులు 28 మార్చ్ 1985లో శివైక్యం చెందారు. ముమ్మిడివరం బాలయోగీశ్వరుల తపో మందిరంలో మహాశివరాత్రి పర్వదినాలు వైభవంగా వేడుకలు కొనసాగుతాయి. గోదావరి జిల్లాలో ఎక్కువగా తమ బిడ్డలకు బాలయోగి పేరు పెట్టుకోవడానికి కారణం భగవాన్ బాలయోగి చూపిన ఆధ్యాత్మిక ప్రభావమే కారణం. ఆత్మయోగి బాలయోగి తన ధ్యానసిద్ధితో మౌనముద్రతో భక్తుల హృదయాల్లో జ్ఞానకాంతిని ప్రసరింపచేసి ఆధునిక భారతీయ యోగుల పరంపరలో ఆరాధ్యుడిగా నిలిచిపోయారు.





