
స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో తెలుగునాట ఖద్దరు వస్త్రధారులైన కాంగ్రెసు స్వచ్చంద శివకులు మువ్వన్న జెండాను ఎగురవేసుకుంటూ ముక్తకంఠంతో ‘మా కొద్దీ తెల్ల దొరతనం, సైతాను ప్రభుత్వ వచ్చి అన్యాయకాలంబు దాపురించిందిపుడు” మొదలైన గీతాలు పాడుతూ ఉండేవారు. ఆ గీత రచయిత గరిమెళ్ళ.
“పన్నెండు దేశాలు పండుచున్నాగానీ పట్టెడన్నమె లోపముండీ ఉప్పుముట్టుకుంటే దోషమండీ నోటమట్టి కొట్టి పోతాడండీ అయ్యో! కుక్కలతో పోరాడి కూడు తింటామాండీ; గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ రావద్దు రావద్దంటాడు; రాట్నం బడిలో పెట్టవద్దంటాడు; టోపీ తీసి వీపుల బాదుతాడు వాడి రాజద్రోహమంత రాట్నములో ఉన్నదట!”
1915వ సంవత్సరంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత సబర్మతీ ఆశ్రమాన్ని స్థాపించి, గాంధీజీ ఒకసారి జాతీయ గీతాల కవుల సమావేశాన్ని నిర్వహించారు. ఆహ్వానితుల్లో గరిమెళ్ళ కూడా ఒకరు. వచ్చిన కవులు తమ గీతాల్ని వరుసగా వినిపించసాగారు. గరిమెళ్ళ తనవంతు వచ్చాక “మా కొద్దీ తెల్ల దొరతనం” అంటూ పై గీతాలన్నీ ఆలపించి, దానికి బహుమతి ఒక సంవత్సరం జైలు శిక్ష అని చెప్పారు. గాంధీజీ పాటను విని ఆశ్చర్యచకితులై అదే బాణీలో పాటలు వ్రాయమని మిగతా కవులకు సలహా ఇచ్చారట.
“మానవజన్మంబెత్తినావు, మనిషి రక్తం త్రాగకురో, పొరుగువాని మాంసం తింటే, పొట్ట పగిలిపోతుంది” అంటూ ప్రబోధించిన జాతీయకవి శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో 1893లో జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం వారిది. పైగా పెద్ద కుటుంబం. ఎనిమిది మంది సంతానం. అయిదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, అందరిలోనూ పెద్దవాడు శ్రీ సత్యనారాయణ గారు, ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే జరిగింది. ఉన్నత విద్యాభ్యాసానికి విజయనగరం వెళ్ళి వచ్చిన తరువాత గరిమెళ్ళ వారిలోని దేశభక్తి పురులు విప్పసాగింది. అప్పుడే ఈ “మాకొద్దీ తెల్ల దొరతనం” కవిత జానపద బాణీలో ఆవిర్బవించింది.ఎందుచేతనో విజయనగరం కళాశాలను వదలి శ్రీ గరిమెళ్ళ మచిలీపట్నం వచ్చి నోబుల్ కళాశాలలో బి.ఏ.లో చేరి అక్కడే డిగ్రీని తీసుకున్నారు. తర్వాత విజయనగరంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా కొన్నాళ్ళు, గంజాం జిల్లా కలెక్టరు గారి కార్యాలయంలో గుమాస్తాగా కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు. కానీ ఆ ఉద్యోగాలు ఆయనకు తృప్తి కల్గించలేదు. అందువల్ల కొంతకాలం స్వగ్రామంలోని జ్ఞానోదయ సమాజ గ్రంథాలయానికి కార్యదర్శిగా పని చేశారు.
1907లో బిపిన్ చంద్రపాల్ దక్షిణ భారతదేశంలో విస్తృతంగా పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం, రాజమహేంద్రవరం మొదలైన పట్టణాలలో ఉపన్యసించారు.ఆ సమయంలో ఆయన ప్రసంగం విన్న శ్రీ గరిమెళ్ళ తీవ్రంగా స్పందించారు.1920లో ప్రభుత్వ ట్రయినింగ్ కళాశాలలో ఎల్.టి. కోర్టు గ్రామానికి చదువుదామని రాజమహేంద్రవరం వెళ్ళిన సుబ్రహ్మణ్యంగారి వంటి దేశభక్తులవల్ల
,మరింత ప్రభావితమైయ్యారు.గాంధీజీ ప్రవేశపెట్టిన త్రివిధ బహిష్కారానికి – అంటే ఇంగ్లీషు పాఠశాలల, న్యాయస్థానాల, శాసనసభల బహిష్కారం స్పందించి తాను చదివే చదువుకు స్వస్తి చెప్పాడు. 1921లో వేల్స్ యువరాజు భారతదేశ పర్యటనకు వచ్చినపుడు దేశభక్తులు నిరసన ప్రదర్శనలు జరిపారు. అనేకమంది ప్రదర్శకులు తుపాకీ గుండ్లకు ఆహుతులయ్యారు. ఆ సమయంలో “ఏమయ్యో, యువరాజా! ఎందుకొచ్చావయ్యా'” అంటూ వ్రాసిన గరిమెళ్ళ వారి గీతం ఆంధ్రదేశంలో ప్రతి నోటా వినపడింది.
1922వ సంవత్సరంలో రాజమహేంద్రవరం కలెక్టరుగా పనిచేస్తున్న జి.టి. హెచ్ బ్రేకన్ గరిమెళ్ళను పిలిపించి తన సముఖంలో ఆ గీతాన్ని పాడమన్నాడు. గరిమెళ్ళ తన కంచుకంఠమెత్తి ‘మా కొద్దీ తెల్ల దొరతనం’ పాట పాడాడు. వెంటనే కలెక్టర్ 124 ఏ సెక్షన్ చట్టం క్రింద గరిమెళ్ళ వారిని అరెస్టు చేయించి కాకినాడ పంపారు. అక్కడి జిల్లా మేజిస్ట్రేటు ఆయనకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షను విధించి కడలూరు జైలుకు పంపారు. ఆ శిక్షను అనుభవిస్తూనే గరిమెళ్ళ “దండాలండోయ్, మేముండలేమండోయ్ బాబూ ఈ సైతాను ప్రభుత్వం సాగనీయమండోయ్ బాబూ!” అంటూ 113 చరణాల దీర్ఘ గీతాన్ని వ్రాశారు. దీనితో గరిమెళ్ళ మీద రాజద్రోహ నేరం మోపబడింది. విచారణ తర్వాత గరిమెళ్ళ రెండేండ్ల శిక్ష విధించారు. మొదట విధించబడిన శిక్షను, ఈ శిక్షను ఆయన ఏకకాలంలో అనుభవించారు. మధ్యలో విడుదల కాలేదు. మధ్య కాలంలో ఆయన గళంనుండి వెలువడిన “కూలిపోతున్నది. కూలిపోతున్నది. మూల మున్నా మట్టముతోటి, కూలిపోతున్నది ప్రభుత్వం, కూకటివేళ్ళతో కూలిపోతున్నది పర ప్రభుత్వం” అనే అద్భుతగీతాన్ని ఆంధ్రులు మరువలేరు.
1923 జనవరిలో గరిమెళ్ళ వారి జనకులు వెంకట నరసింహంగారు పరమపదించారు. క్షమాపణ పత్రం ఇస్తే పెరోల్ మీద వెళ్ళవచ్చునని జైలు అధికారులుతెలియజేశారు. అందుకు గరిమెళ్ళ అంగీకరించలేదు. తత్ఫలితంగా జ్యేష్ఠుడై కూడా గరిమెళ్ళ కన్నతండ్రిని కనీసం కడసారి కూడా చూడటానికి నోచుకోక, కన్నతండ్రి ” అంత్యక్రియలను నిర్వహించలేక తల్లడిల్లిపోయారు. జైలునుండి విడుదలయ్యాక గరిమెళ్ళ స్వగ్రామానికి తరలివచ్చారు. అప్పటికే కుటుంబ పరిస్థితులు తారుమారయినాయి. అప్పులు పెరిగినాయి, భూములు తరిగినాయి. చిట్టచివరకు తన సహధర్మచారిణి కూడా కాలధర్మం చెందారు. ఆ పరిస్థితుల్లో 1933లో ఆయన మద్రాసుకు మకాం మార్చారు. డిసెంబరు 18వ తేదీ 1952న ఉదయం పన్నెండు గంటలకు గరిమెళ్ళ వారు దివంగతులయ్యారు.





