
శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు చివరిదశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు చండీశ్వర పూజ, మండపారాధనలు, కలశార్చన, రుద్ర పారాయణం, చండీ, రుద్ర హోమాలను పండితులు నిర్వహించారు. 9 గంటలకు యాగశాలలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం చండీశ్వరుడిని మంగళవాయిద్యాల నడుమ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు, ఈవో డి.పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.
పుష్కరిణిలో చండీశ్వరునికి పూజలు చేసి అవబృద, త్రిశూల స్నానాలు నిర్వహించారు. వసంతోత్సవం కనులపండువగా జరిపారు. సాయంత్రం 8 గంటలకు కల్యాణ మండపంలో ఆది దంపతులైన స్వామి,అమ్మవార్లకు సదస్యం, నాగవల్లి, ఆస్థానసేవ చేశారు. రాత్రి 7.30కు ధ్వజావరోహణ చేశారు. సోమవారం రాత్రి 7 గంటలకు ఉత్సవమూర్తులకు అశ్వవాహనసేవ, రాత్రి 8 గంటల నుంచి శయనోత్సవం, ఏకాంతసేవలు నిర్వహించనున్నారు. ఏకాంతసేవతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు.





