
భాగ్యనగరం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. మతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పీఎఫ్ఐ చేస్తున్న తప్పులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.
దేశంలో కల్లోలం సృష్టించేందుకు అక్రమ మార్గాల్లో నిధులు సేకరిస్తూ ఆధారాలతో సహా దొరికిపోయిన పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని విజయశాంతి మండిపడ్డారు. తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షించాలి తప్ప, మొత్తం సంస్థపై నిషేధాన్ని తాను సమర్ధించలేనంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు యూపీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దొరికిన ఆధారాల మేరకు ఈ సంస్థను నిషేధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రానికి సిఫార్సు చేశాయని ఆమె గుర్తు చేశారు. మతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పీఎఫ్ఐ చేస్తున్న తప్పులు, అక్రమాలు ఈ రాష్ట్రాలకే పరిమితం కాలేదని, పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఆధారాలు దొరికాయని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Source: Nijamtoday





