News

భారత నౌకాదళానికి ‘మచిలీపట్నం’ జలాంతర్గామి నౌక

6views

కొచ్చిన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (CSL) భారత నౌకాదళం కోసం నిర్మించిన ‘మచిలీపట్నం’ జలాంతర్గామి విధ్వంసక నౌకను  లాంఛనంగా జలప్రవేశం చేసింది. భారత్‌ నిర్మిస్తున్న ఎనిమిది జలాంతర్గామి విధ్వంసక నౌకల (ASW SWC) శ్రేణిలో ఇది ఏడోది.

రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నౌక సముద్ర గర్భంలో నిఘా నిర్వహించడం, జలాంతర్గాములను గుర్తించి విధ్వంసం చేయడం, తక్కువ తీవ్రత గల సముద్ర కార్యకలాపాలు (LIMO), మైన్‌ వార్‌ఫేర్‌ వంటి మిషన్లను సమర్థంగా నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ నౌక భారత తీరప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు సముద్ర డొమైన్‌ అవగాహనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించనుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రక రేవు పట్టణం మచిలీపట్నం పేరును ఈ నౌకకు నామకరణం చేశారు. దీంతో ఆ ప్రాంత సముద్ర వారసత్వానికి గౌరవం చాటినట్లవుతుందని అధికారులు పేర్కొన్నారు. 80 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ నౌక భారత నౌకా నిర్మాణ రంగం సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు.

సైనిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ ఆనంద్‌ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఈ నౌకను జలప్రవేశం చేశారు.