News

పర్యావరణ పరిరక్షణకు అటవీశాఖ వినూత్న చర్యలు

41views

పల్నాడు జిల్లా : కోటప్పకొండ పరిసర ప్రాంతంలోని గొనెపూడి కొండలో అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం విత్తన బంతులు విస్తరణ కార్యక్రమం నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డ్రోన్ సాంకేతికతను వినియోగించి కొండ ప్రాంతాల్లో విత్తన బంతులను వెదజల్లడంతో పాటు మొక్కలు నాటారు. అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ.. ప్రకృతి మానవాళికి గాలి, నీరు, వర్షం, ఆహారం వంటి అనేక వరాలను అందిస్తోందని అన్నారు. అయితే చెట్ల నరికివేత, కొండల విధ్వంసం వంటి చర్యల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని పేర్కొన్నారు.

వాతావరణ మార్పుల కారణంగా ఎల్‌నీనో వంటి పరిస్థితులు ఏర్పడి వర్షపాతం క్రమరహితంగా మారుతోందని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. భారతీయ పండుగలు, సంస్కృతి ప్రకృతితో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయని, ప్రకృతిని కాపాడుకోవడం అంటే భవిష్యత్ తరాలను రక్షించుకోవడమేనని అన్నారు.

చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలని సూచించిన ఎమ్మెల్యే, ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. తాము నాటిన మొక్కలు భవిష్యత్తులో పెద్ద వృక్షాలుగా ఎదిగి తరతరాలకు ప్రయోజనం చేకూరుస్తాయని అన్నారు.

డ్రోన్ సాంకేతికత ద్వారా విత్తన బంతులను వెదజల్లడం వినూత్న కార్యక్రమమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను పర్యావరణ పరిరక్షణకు వినియోగించడం అభినందనీయమన్నారు. విపత్తుల సమయంలో ఆహారం, మందులు వంటి అత్యవసర వస్తువుల సరఫరాలో కూడా డ్రోన్ టెక్నాలజీ ఉపయోగపడుతోందని తెలిపారు.

జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణప్రియ మాట్లాడుతూ.. అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు సీడ్ బాల్స్ డిస్పర్సల్ కార్యక్రమాలు సమర్థవంతమైన మార్గాలని అన్నారు. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని, మొక్కల సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు.

కార్యక్రమంలో విద్యార్థులు సీడ్ బాల్స్ తయారీ విధానం, వాటి వినియోగం, డ్రోన్ ద్వారా విత్తనాల పంపిణీ ప్రక్రియపై ఆసక్తి కనబరిచారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.