News

‘భారత్​ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర… పీఎఫ్ఐని బ్యాన్ చేయండి’

198views

న్యూఢిల్లీ: ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి ఉసిగొల్పే విధంగా ఈ పత్రాలు ఉన్నాయని ఎన్​ఐఏ పేర్కొంది. కేసుకు సంబంధించిన పది మందిని అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ మేరకు రిమాండ్ రిపోర్టును రూపొందించింది.

స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఓ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుల పేర్లు ఉన్నట్టు తెలిపింది. నేతల ఆదేశాలతో పనిచేస్తున్న పీఎఫ్​ఐ సభ్యులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో యువతను తప్పుదోవపట్టించిందని వివరించింది.

యువతను లష్కరే తోయిబా, ఐఎస్ఐ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా పీఎఫ్ఐ ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ తెలిపింది. ఇందులో భాగంగా ఈ సంస్థ.. భారతదేశంలో ఇస్లామిక్​ పాలనను స్థాపించడానికి కుట్ర పన్నిందని నివేదికలో వెల్లడించింది. మరోవైపు, ఈ సంస్థపై నిషేధం విధించాలని ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. పీఎఫ్ఐకి సంబంధించిన కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని సూచించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి