News

భారత్ – రష్యా వాణిజ్య సంబంధాలపై పాశ్చాత్య దేశాలది ద్వంద్వ వైఖరి : రష్యా

Russian diplomat Denis Alipov to return to India as Ambassador
408views

తమ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకునే భారత్‌ను పాశ్చాత్య దేశాలు (Western Countries) విమర్శించడాన్ని రష్యా తప్పుపట్టింది.

రష్యాపై ఆంక్షలు విధిస్తోన్న పశ్చిమ దేశాలు చమురు విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చుకోవడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని మండిపడింది. భారత్‌-రష్యా దేశాల మధ్య వాణిజ్యం గణనీయమైన పురోగతి సాధిస్తోందని స్పష్టం చేసింది.

‘రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ ‌ను విమర్శించే దేశాలు, తాము మాత్రం రష్యా నుంచే చమురు కొనుగోలు చేస్తున్నాయి. వాళ్లు విధించే ఆంక్షల నుంచి వారికి వారే మినహాయించుకుంటున్నాయి. ఇది వారి దుర్మార్గమైన, ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోంది’ అని భారత్ ‌లోని రష్యా రాయబారి (Russia Ambassador) డెనిస్‌ అలిపోవ్‌ వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటామని చెబుతూ, చమురు దిగుమతిని భారత్‌ సమర్థించుకున్న తరుణంలో రష్యా రాయబారి ఈ విధంగా వ్యాఖ్యానించారు.

శిలాజ ఇంధనం సరఫరాలో భారత్ ‌కు రష్యా ప్రధాన ఆధారమేమీ కాదన్న రష్యా రాయబారి.. తాము చౌక ధరలో ముడిచమురు అందించడంతో కొన్ని నెలలుగా భారత్‌ నుంచి దిగుమతులు భారీగా పెరిగాయన్నారు. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలు ఒత్తిడి పెంచినప్పటికీ భారత్‌ మాత్రం తన దిగుమతులను కొనసాగించిన విషయాన్ని డెనిస్‌ అలిపోవ్‌ గుర్తుచేశారు. ఈ విషయంలో యూరప్‌ తన సొంత గళాన్ని కోల్పోయిందన్న ఆయన, అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకే ఆరాటపడుతోందని విమర్శించారు. భారత్‌-రష్యా వాణిజ్యంపై అమెరికా ఆంక్షల ప్రభావం ఏమీ ఉండదన్న ఆయన.. ఈ ఏడాది చివరి నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం రికార్డు స్థాయికి చేరుకుంటుందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.