News

‘మనదే రాజ్యం’.. ‘వందేమాతరం’ నినాదాల స్ఫూర్తి ఒక్కటే

249views
  • భీమ‌వ‌రం స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ

భీమ‌వ‌రం: ఈతరం యువత అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని.. నవ భారత నిర్మాణానికి ముందుకు రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందన్నారు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా ఏపీలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. ‘‘మన్యం వీరుడు.. తెలుగుజాతి ముద్దు బిడ్డ.. తెలుగువీర లేవరా.. దీక్ష బూని సాగరా నినాదంతో జన చైతన్యాన్ని నింపిన స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ పుణ్య పుడమిపై మనమంతా కలుసుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను’’ అని మోడీ తెలుగులో పేర్కొన్నారు.

‘‘మన దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను (ఆజాదీకా అమృత్ మహోత్సవ్) జరుపుకుంటున్నాం. సరిగ్గా ఇదే సమయంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రాంతంలో విప్లవకాంతులు నింపిన చారిత్రక రంప ఉద్యమానికి కూడా ఇప్పటికి వందేళ్ళు గడిచాయి. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులతో ఈ వేదికను పంచుకోవడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను’’ అని మోడీ చెప్పారు.

అల్లూరి జీవితంతో ముడిపడిన ప్రాంతాల జీర్ణోద్ధరణ

‘‘ఆంధ్ర రాష్ట్రంలో జన్మించిన స్వాతంత్య్ర సంగ్రామ వీరులందరికీ నా శ్రద్ధాంజలి, నమస్సుమాంజలి. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవం, వందేళ్ళు నిండిన రంప ఉద్యమ ఉత్సవాలను మనం పండుగలా ఈ ఏడాదంతా జరుపుకోవాలి’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ‘‘పండ్రంగిలో అల్లూరి జన్మ స్థానాన్ని జీర్ణోద్ధరణ చేయడం, ఆంగ్లేయులకు ఎదురొడ్డి అల్లూరి నిలబడిన చింతపల్లి పోలీసు స్టేషన్, ధ్యాన మందిర నిర్మాణాలను చేపట్టి జాతికి అంకితం చేస్తాం’’ అని మోడీ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జీవితంతో ముడిపడిన ప్రాంతాల జీర్ణోద్ధరణకు కృషి చేస్తున్న వారిని ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు. ‘‘మనదే రాజ్యం నినాదంతో అల్లూరి సీతారామరాజు ఆనాడు ప్రజలను చైతన్యపరిచారు.

‘వందేమాతరం’ నినాదం కూడా ‘మనదే రాజ్యం’ నినాదంతో సరితూగేలా ఉంటుంది. మన పూర్వీకుల హైందవ చింతన వల్లే అల్లూరిలో త్యాగం, సాహసం, ఉద్యమ పటిమ వచ్చాయి. పాతికేళ్ళ వయసులో స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించి అతి చిన్న వయసులోనే అల్లూరి స్వర్గస్తులయ్యారు. ఆయన త్యాగం చిరస్మరణీయం’’ అని మోడీ తెలిపారు. లంబసింగిలో అల్లూరి మెమోరియల్, లైబ్రరీ నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.

లంబసింగి లైబ్రరీ ద్వారా ఆదివాసీల సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. విశాఖలో ట్రైబల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్కిల్ ఇండియా స్కీమ్ ద్వారా ఆదివాసీలకు శిక్షణ అందిస్తామని ప్రధాని తెలిపారు. ఆదివాసీల కోసం దేశవ్యాప్తంగా 750 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

Source: VTelugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి