News

వాయుసేన సాహసం ‘ఆపరేషన్‌ సిందూర్‌’

47views

చుట్టూ చిమ్మచీకటి.. నలువైపులా పొంచి ఉన్న ఆపద.. కళ్లముందు కన్పిస్తున్న లక్ష్యం.. సరిగ్గా ఏడాది క్రితం మన వాయుసేన ముందున్న పరిస్థితి ఇది. అలాంటి విపత్కర క్షణాల్లో మన వీర జవాన్లు సాహసం చేశారు. అర్ధరాత్రి వేళ శత్రువు రక్షణ కోటను ఛేదించి ఉగ్రమూకల స్థావరాలను తునాతునకలుగా పేల్చేశారు. ఈ తెగువతోనే ‘ఆపరేషన్‌ సిందూర్‌ ’ సమయంలో మన వాయుసేన.. దాయాది పాకిస్థాన్‌ వెన్నులో వణుకుపుట్టించింది.

మే 6-7 అర్ధరాత్రి వేళ మన సైన్యం.. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌ను ఎలా సాగించారు? ఇందులో ఎవరు పాల్గొన్నారు? ఏయే యుద్ధ విమానాలను వాడారు? అన్న వివరాలను తొలుత ఐఏఎఫ్‌ భద్రతా నిబంధనల రీత్యా వెల్లడించలేదు. అయితే, గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘సిందూర్‌’లో పాల్గొన్న వీరులను గ్యాలంట్రీ పురస్కారాలతో సత్కరించారు. ఆ సమయంలో కేంద్రం వెలువరించిన ప్రకటనతో ఈ ఆపరేషన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు బహిర్గతమయ్యాయి.

తక్కువ ఎత్తులో ప్రయాణించి..


‘సిందూర్‌’ సమయంలో పాక్‌లోని చాలా లక్ష్యాలపై మన బలగాలు దాడులు చేశాయి. అన్నింటికంటే ముందు పాక్‌ రక్షణవ్యవస్థను ఛేదించి ఉగ్రముఠాల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. సాధారణంగా ఈ స్థావరాల వద్ద పాక్‌ మిలిటరీ నిరంతరం పహారా కాస్తుందనే సమాచారం ఉంది. దీంతో శత్రు దేశ గగనతల రక్షణ వ్యవస్థల కంటపడకుండా ఉండేందుకు మన వాయుసేన విమానాలు అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించాయి. ఇది చాలా సవాలుతో కూడుకున్నది. ఒకవేళ రాడార్‌ నిఘా వ్యవస్థలు గుర్తిస్తే కింద నుంచి ఈ విమానాలను శత్రుసైన్యం లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ మన వాయుసేన యుద్ధవిమానాలు సాహసోపేతంగా ప్రయాణించాయి. తక్కువ సమయంలో పాక్‌ రక్షణ వ్యవస్థను ఛేదించి అత్యంత కచ్చితత్వంతో 9 ఉగ్ర స్థావరాలపై బాంబులు కుమ్మరించాయి. ఈ దాడుల్లో లష్కరే తయ్యిబా, జైషే మహ్మద్‌కు చెందిన పలు స్థావరాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి.

తొమ్మిది మందికి ‘వీరచక్ర’ పురస్కారాలు..


ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న తొమ్మిది మంది ఐఏఎఫ్‌ అధికారులను కేంద్రం ‘వీర చక్ర’ పురస్కారాలతో సత్కరించింది. సుఖోయ్‌ 30 ఎంకేఐ, జాగ్వర్‌, తేజస్‌, మిరేజ్‌-2000, మిగ్‌-29 వంటి యుద్ధ విమానాలతో వీరు ‘సిందూర్‌’లో పాల్గొన్నారు.

  • ఈ స్క్వాడ్రన్‌కు గ్రూప్‌ కెప్టెన్‌ మనీశ్‌ అరోరా కమాండింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారు. శత్రువు నిఘా నుంచి తప్పించుకుని పలు లక్ష్యాలపై గగనతల దాడులు నిర్వహించారు. శత్రువు ప్రతిఘటించలేని విధంగా అరోరా బృందం భీకర దాడులు జరిపిందని పురస్కార ప్రకటన సందర్భంగా కేంద్రం వెల్లడించింది.
  • ఇక, మరో గ్రూప్‌ కెప్టెన్‌ కునాల్‌ కల్రా కూడా ప్రతికూల పరిస్థితుల్లో రెండు లక్ష్యాలను ఛేదించారు. తొలి లక్ష్యంగా కునాల్‌ బాంబులను జారవిడిచిన తర్వాత.. ఆయన ప్రయాణించిన యుద్ధ విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. అయినప్పటికీ ఆయన వెనక్కి రాకుండా తన ఆయుధ వ్యవస్థను రీసెట్‌ చేసి రెండో లక్ష్యంపై దాడి జరిపారు.
  • స్క్వాడ్రన్‌ లీడర్‌ సార్థక్‌ కుమార్‌ మరో కీలక పాత్ర చేపట్టారు. ఆపరేషన్‌ తొలి రోజున పక్కా ప్రణాళిక, కచ్చితమైన నిఘా సమాచారంతో శత్రుదేశ నెట్‌వర్క్‌లో చాలా లోపలివరకు వెళ్లి లక్ష్యాలపై దాడులు చేశారు. ఆ మరుసటి రోజు కూడా దీర్ఘశ్రేణి దాడులు జరిపారు.
  • మరో స్క్వాడ్రన్‌ లీడర్‌ సిద్ధాంత్ సింగ్‌ అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించి భారీ స్థాయిలో బాంబులను జారవిడిచింది. ఆ సమయంలో శత్రు దేశం నుంచి ప్రతిస్పందన ఎదురైనా.. ఆయన వెరవకుండా లక్ష్యాలను ఛేదించి తిరిగొచ్చారు.
  • ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఫైటర్‌ స్క్వాడ్రన్‌కు గ్రూప్‌ కెప్టెన్‌ రంజీత్‌ సింగ్‌ సిఘు కమాండర్‌గా వ్యవహరించారు. ఇక, వింగ్‌ కమాండర్‌ జాయ్‌ చంద్ర, స్క్వాడ్రన్‌ లీడర్‌ రిజ్వాన్‌ మాలక్‌, ఫ్లైట్‌ లెఫ్టినెంట్ అర్ష్‌వీర్‌ సింగ్‌ ఠాకూర్‌ కూడా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో శత్రుదేశ రక్షణ వ్యవస్థలోకి వెళ్లారు.
  • భూఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి విభాగానికి గ్రూప్‌ కెప్టెన్‌ అనిమేశ్‌ పట్ని కమాండర్‌గా పనిచేశారు. శత్రువుల నుంచి ఎదురయ్యే ప్రతిదాడులను అడ్డుకోవడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.