
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం ఆలయాల అభివృద్ధికి దేవాదాయశాఖా రూ.3.70 కోట్లు మంజూరు చేసింది. కాగా… క్షేత్ర ప్రాశస్త్యం, పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా పూర్తిస్థాయిలో వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం నిర్ణయించి, ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం త్రిపురాంతకంలోని ఆలయాల అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే పుదుచ్చేరికి చెందిన చీఫ్ ఆర్కిటెక్ట్ అరుల్ నేతృత్వంలోని బృందం ఆలయాలను ఇటీవల సందర్శించింది. చారిత్రక సంపద పరిరక్షణతో పాటు భక్తులకు కల్పించాల్సిన వసతులు, ఇతర అంశాలపై సభ్యులు వివరాలు సేకరించారు. ప్రాథమికంగా నివేదిక తయారుచేసి… దాని ఆధారంగా క్షేత్రం అభివృద్ధికి బృహత్ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నారు.
సిఫారసు చేసిన అంశాలు…
మహానందితో పాటు త్రిపురాంతకం ఆలయాలను అన్ని హంగులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు వచ్చిన నిపుణుల కమిటీ ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసింది. ఈ క్రమంలో ఈవో డి.అనిల్‌కుమార్ పలు అంశాలను సభ్యుల దృష్టికి తీసుకువెళ్లారు. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరం, పశ్చిమం వైపు పడిపోయిన రాజగోపురాల పునరుద్ధరణ, ఆలయ ప్రాంగణంలో గ్రానైట్ ఫ్లోరింగ్, ఘాట్ రోడ్డులో రక్షణ గోడ నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. బాలాత్రిపురసుందరీదేవి ఆలయాన్ని విస్తరించడంతో పాటు గ్రానైట్ ఫ్లోరింగ్, పొంగళ్లు వండుకునేందుకు వీలుగా షెడ్డు, భక్తులకు వసతి గదులు, పాలనా కార్యాలయం నిర్మించాలని తెలిపారు. బృహత్ ప్రణాళిక రూపొందాక ప్రసాద్ పథకం లేదా సీజీఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేస్తారని అధికారులు తెలిపారు.





