News

‘ప్రకృతితో సహజీవనమే మానవాళికి రక్ష’: జీ7 సదస్సులో మోదీ

326views

జర్మనీ: వాతావరణ మార్పుల కట్టడి కోసం ఇచ్చిన హామీలకు భారత్‌ గట్టిగా కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తమ పనితీరు ఇందుకు అద్దం పడుతోందన్నారు. ప్రకృతితో సహజీవనానికి ప్రపంచం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో తాము సాగిస్తున్న ప్రయత్నాలకు ధనిక దేశాల కూటమి అయిన జీ7 తోడ్పాటు అందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. భారత్‌లో పర్యావరణహిత పరిజ్ఞానాలకున్న భారీ గిరాకీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌, కెనడాలతో కూడిన జీ7 కూటమి శిఖరాగ్ర సమావేశం దక్షిణ జర్మనీలో ప్రకృతి సోయగాల మధ్య కొలువుదీరిన ఎల్‌మావ్‌లో జరుగుతోంది. ఈ భేటీకి భారత్‌, అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా నేతలను జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం జర్మనీ చేరుకున్న మోదీ.. సోమవారం ఎల్‌మావ్‌లో తీరికలేకుండా గడిపారు. ‘వాతావరణం, ఇంధనం, ఆరోగ్యం’ అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు.

పర్యావరణ అనుకూల విధానాల్లో భారత్‌ సాధించిన విజయాలను ప్రస్తావించారు. “పూర్తిగా సౌరశక్తితో నడిచే ప్రపంచ తొలి విమానాశ్రయం భారత్‌లోనే ఉంది. భారతీయ రైల్వే వ్యవస్థ ఈ దశాబ్దంలో ‘నెట్‌ జీరో’ స్థాయిని సాధిస్తుంది. భారత్‌ వంటి పెద్ద దేశం ఇలాంటి లక్ష్యాలను సాధించడం.. ఇతర వర్ధమాన దేశాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పర్యావరణహిత పరిజ్ఞానానికి సంబంధించిన పరిశోధన, ఆవిష్కరణలు, తయారీలో జీ7 దేశాలు పెట్టుబడులు పెట్టాల‌ని కోరారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి