News

ఓడిపోయే పోరుకు నేనెందుకు? – మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్

277views

* రాష్ట్రపతి పదవికి పోటీపై ప్రతిపక్ష పార్టీలకు స్పష్టం చేసిన శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు నిరాకరించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై ఏకాభిప్రాయం కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రతిపక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ ఆఫ్ ఇండియాలో జరుగుతోన్న సమావేశంలో పవార్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.

ఈ పదవికి పవార్‌ పేరును మమత ప్రతిపాదించగా.. ఇంకా క్రియాశీల రాజకీయాల్లో తాను కొనసాగాల్సి ఉందని చెప్తూ మమత ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికకు సంబంధించి మరో పేరు ప్రస్తావనకు రాలేదు. కాగా ఈ సమావేశానికి 16 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.

జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ.. ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనిపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరుకావాలని 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా మొత్తం 22 మంది నేతలకు లేఖలు వ్రాశారు. కాగా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, శివసేన, ఎన్‌సీసీ, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీఎస్,డీఎంకే, ఆర్‌ఎల్‌డీతో సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.

ఈ పదవికి సంబంధించి మొదటి నుంచి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పవార్ పేరే వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయన్న దానిపై శరద్‌ పవార్‌ నమ్మకంగా లేరట. అందుకే ఓడిపోయే పోరులో బరిలోకి దిగేందుకు ఆయన సుముఖంగా లేరని ఇదివరకే సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా… మమతా బెనర్జీ పిలుపునిచ్చిన సమావేశానికి పలువురు అగ్రనేతలు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మనీ లాండరింగ్ కేసులో మూడురోజులుగా ఈడీ విచారణకు హాజరవుతున్నారు. దాంతో ఆయన రాలేకపోయారు. మమతా బెనర్జీ సమావేశానికి కాంగ్రెస్ ను ఆహ్వానించారన్న కోపంతో కేసీఆర్ కూడా సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇదే కారణంతో శిరోమణి అకాలీదళ్‌ నేతలు కూడా సమావేశానికి రాలేదు. ఆప్‌, బీజేడీ, వైఎస్సార్‌సీపీ పార్టీ నేతలు కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.