News

భారత మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస క్షమాపణలు

218views

భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె(46) మృతికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంతాపం తెలియజేసింది. గాజాలో ఐరాస తరపున విధులు నిర్వహిస్తూ కాల్పుల్లో కాలె మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని ఐరాస పేర్కొంది. క్షమాపణలు కూడా తెలిపింది. “కాలె మృతి నేపథ్యంలో భారత ప్రభుత్వానికి, పౌరులకు సంతాపం, క్షమాపణలు తెలియజేస్తున్నాం. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదే శించాం. ఈ ఘటన వివరాలను ఇజ్రాయెల్ సైన్యం తోనూ ధ్రువీకరించుకుంటున్నాం” అని ఐరాస అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ పేర్కొన్నారు. రెండు నెలల క్రితమే ఐరాస రక్షణ, భద్రతా విభాగంలోకి చేరిన అనిల్.. రఫాలో ఓ ఆసుపత్రి పరిస్థితిని సమీక్షించడా నికి వెళ్తున్న సమయంలో మృతి చెందారు. ఇజ్రాయెల్ ట్యాంకర్ కాల్పుల్లోనే అనిల్ ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస వర్గాలు అనుమానిస్తున్నాయి. అనిల్ కాలె మృతిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబికులు, సన్నిహితులకు సంతాపం తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సంబంధిత అధికారు లతో మాట్లాడుతున్నామని తెలిపింది. కాలె పార్థివ దేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంతోపాటు ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ లో ఉన్న భారత విదేశాంగ విభాగాలు కూడా కృషి చేస్తున్నాయని పేర్కొంది.