పాకిస్తాన్ ఎంపీ సయ్యద్ ముస్తాఫా కమల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ పార్లమెంటులో భారత్ సాధిస్తున్న ఘనతలు ప్రస్తావించారు. భారత్ చంద్రుడిపై అడుగుపెడుతుంటే, పాకిస్తాన్ పిల్లలు గట్టర్లలో పడి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ (MQM-P) ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ పాకిస్తాన్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ ఆ దేశంలో నెలకొన్న సమస్యలు ప్రస్తావించారు. కరాచీలో చాలామంది చిన్నారులు మురికి కాల్వల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.
కరాచీలో తాగునీటి కొరత గురించి కూడా చర్చించారు. రెండు ఓడరేవులతో దేశానికి గేట్ వేగా ఉన్న కరాచీలో 15 ఏళ్ళగా పరిశుభ్రమైన తాగునీరు అందించలేకపోతున్నామన్నారు. నీటి మాఫియా ట్యాంకర్లను అమ్ముకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింధ్ ప్రావిన్స్‌లో దాదాపు 70లక్షల మంది చిన్నారులు పాఠశాలలకు వెళ్లడం లేదన్నారు. 48వేల పాఠశాలలు ఉంటే అందులో 11 వేలు ఖాళీగా ఉన్నాయన్నారు. చదువుకోని మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. భారత్, పాకిస్తాన్ కలిసి స్వాతంత్య్రం పొందాయని.. కానీ నేడు (భారత్) అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుందన్నారు.





