ArticlesNews

18 నుంచి సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు

175views

సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా అన్నవరం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ పావన పంపా నదీ తీరాన రత్నగిరిపై వెలసిన భక్తవరదుడు.. శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రత్నగిరిపై సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11.030 గంటల వరకూ స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

నిత్య కల్యాణాలు రద్దు
కల్యాణోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం అధికారులతో ఈఓ కె.రామచంద్ర మోహన్‌ గడచిన వారం రోజుల్లో రెండుసార్లు సమావేశమై ఏర్పాట్లు పురోగతిపై చర్చించారు. కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలని ఆదేశించారు. ప్రధానంగా 19వ తేదీన జరిగే స్వామివారి కల్యాణం, 22న జరిగే రథోత్సవం సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ సత్యదేవుని నిత్య కల్యాణాలను రద్దు చేశారు. ఈ నెల 25 నుంచి తిరిగి ఈ కల్యాణాలు నిర్వహిస్తారు.

సీతారాములే పెళ్లి పెద్దలు
భద్రాద్రి రాముని కల్యాణోత్సవం తరువాత తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రాముఖ్యత కలిగిన వేడుక సత్యదేవుని దివ్యకల్యాణం. ఈ వేడుకకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అన్నవరం క్షేత్ర పాలకునిగా శ్రీరాముడు పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. ఆ హోదాలో సత్యదేవుని కల్యాణోత్సవాలకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తూండటం ఇక్కడి సంప్రదాయం.