News

క‌శ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల కాల్చివేత!

429views
  • బ్యాంక్ మేనేజర్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా దళాలు

క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చాయి. కంజులార్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్టు బుధవారం నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, సాయుధ దళాలు కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు ముష్కరులు హతమైనట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

మరణించిన ఉగ్రవాదులను లష్కరే తోయిబా సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్టు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. వారిలో ఒకర్ని షోపియాన్‌కు చెందిన జాన్‌ మహ్మద్‌ లోన్‌గా గుర్తించామ‌ని చెప్పారు. జూన్‌ రెండో తేదీన కుల్గామ్​ జిల్లాలో బ్యాంకు మేనేజర్ విజయ్‌కుమార్‌ను కాల్చిచంపిన కేసులో జాన్‌మహమ్మద్ లోన్ నిందితుడని తెలిపారు.

కుల్గామ్‌ జిల్లా మోహన్​పొరాలో జూన్​ 2న బ్యాంకు మేనేజర్​ విజయ్​కుమార్​పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. రాజస్థాన్​కు చెందిన విజయ్​కుమార్​.. కశ్మీర్​లోని మోహన్​పొరాలో ఉన్న ఇలాఖీ దేహతి బ్యాంకు బ్రాంచ్​ మేనేజర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి