News

శబరిమలలో కమర్షియల్‌ సినిమా షూటింగ్‌లకు నో.. కేరళం ప్రభుత్వం కీలక నిర్ణయం

6views

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సాధారణ కమర్షియల్‌ సినిమాల షూటింగ్‌కు ఇకపై అనుమతులు ఇవ్వబోమని కేరళం ప్రభుత్వం స్పష్టం చేసింది. శబరిమలను సాధారణ సినిమా షూటింగ్‌ లొకేషన్‌గా ఉపయోగించేందుకు అనుమతించేది లేదని దేవస్వం మంత్రి కే. మురళీధరన్‌ వెల్లడించారు.

శబరిమలలో మోహన్‌లాల్‌ నటిస్తున్న ‘అతిమనోహరం’ సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడంపై వివాదం నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. ఆలయ పవిత్రత, భక్తుల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని ఇకపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

శబరిమలలో సాధారణ సినిమాల షూటింగ్‌కు అనుమతులు ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదని మంత్రి స్పష్టం చేశారు. అయ్యప్ప స్వామికి సంబంధించిన సినిమాలు, మతపరమైన అంశాలతో తెరకెక్కే చిత్రాలకు మాత్రమే ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఆలయాలను సాధారణ సినిమా షూటింగ్‌ కోసం వినియోగించేందుకు అనుమతించడం సరికాదని పేర్కొన్నారు. శబరిమలలో షూటింగ్‌కు సంబంధించిన నిబంధనలను పూర్తిగా పరిశీలించి, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

‘అతిమనోహరం’తో మొదలైన వివాదం
తరుణ్‌ మూర్తి దర్శకత్వంలో మోహన్‌లాల్‌, మీరా జాస్మిన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘అతిమనోహరం’ చిత్రానికి శబరిమలలోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్‌ చేసేందుకు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

పంపా నుంచి సన్నిధానం వరకు కొన్ని ప్రాంతాల్లో చిత్రీకరణకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే శబరిమల లేదా హిందూ మత విశ్వాసాలను ప్రతికూలంగా చూపించకూడదనే షరతులతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే కీలకమైన అటవీ శాఖ అనుమతి లభించకపోవడంతో షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. దీంతో సాధారణ కమర్షియల్‌ సినిమాకు దేవస్వం బోర్డు అనుమతి ఎలా ఇచ్చిందనే ప్రశ్నలు తలెత్తాయి.

ఇకపై సమన్వయంతో నిర్ణయాలు
దేవస్వం బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత అటవీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయంపై కూడా చర్చ మొదలైంది. శబరిమల వంటి అత్యంత సున్నితమైన ఆధ్యాత్మిక ప్రాంతంలో షూటింగ్‌కు అనుమతుల విషయంలో స్పష్టమైన విధానం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సాధారణ కమర్షియల్‌ సినిమాలకు శబరిమలలో షూటింగ్‌ అనుమతులు ఇవ్వకూడదనే వైఖరిని ప్రభుత్వం స్పష్టం చేసింది.

‘అతిమనోహరం’ చిత్రానికి తరుణ్‌ మూర్తి దర్శకత్వం వహిస్తుండగా, మోహన్‌లాల్‌, మీరా జాస్మిన్‌, లాలు అలెక్స్‌, మనోజ్‌ కే. జయన్‌, జగదీష్‌, ఇర్షాద్‌, సుధీష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. కొచ్చితో పాటు పలు ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మిగిలిన షూటింగ్‌ను కొచ్చి, శబరిమలతో పాటు హైదరాబాద్‌, ముంబైలో నిర్వహించాలని చిత్ర బృందం భావించింది. శబరిమలలో అనుమతులపై తాజా నిర్ణయంతో ప్రత్యామ్నాయ లొకేషన్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గతంలోనూ శబరిమల పరిసరాల్లో చిత్రీకరణ
గతంలో శబరిమల, పంబా పరిసర ప్రాంతాల్లో పలు సినిమాల చిత్రీకరణ జరిగింది. తమిళ చిత్రం ‘నంబినార్‌ కేడువతిల్లై’ (1986)లోని ఓ పాటను శబరిమల 18 మెట్ల వద్ద చిత్రీకరించినట్లు సమాచారం. మలయాళ చిత్రాలు ‘స్వామి అయ్యప్పన్‌’ (1975), ‘మాలికప్పురం’ (2022)తో పాటు కన్నడ చిత్రం ‘సీజర్‌’ (2018)లోనూ శబరిమల పరిసర ప్రాంతాలను చిత్రీకరణకు ఉపయోగించారు.

ఆలయ పవిత్రతకే ప్రాధాన్యం
శబరిమల సాధారణ పర్యాటక ప్రదేశం లేదా సినిమా షూటింగ్‌ లొకేషన్‌ కాదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు అయ్యప్ప దర్శనం కోసం తరలివచ్చే నేపథ్యంలో షూటింగ్‌ల వల్ల భక్తుల రాకపోకలు, భద్రత, ఆధ్యాత్మిక వాతావరణానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మోహన్‌లాల్‌ సినిమా షూటింగ్‌ అనుమతి వివాదం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో శబరిమలలో సాధారణ కమర్షియల్‌ సినిమాల షూటింగ్‌కు దాదాపుగా తలుపులు మూసుకున్నట్లయింది. ఇకపై అయ్యప్ప స్వామి, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ప్రత్యేక అనుమతులు ఇచ్చే అవకాశం ఉంటుందని దేవస్వం మంత్రి స్పష్టం చేశారు.