News

ముల్కనూరులో అరుదైన చారిత్రక ఆనవాలు..

4views

చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా మారుతున్న ముల్కనూరులో మరో అరుదైన శిల్పం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కళ్యాణీ చాళుక్యుల కాలం నాటి శాసనాన్ని గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుడికందుల కిషోర్, సిద్ధమల్ల రమేష్ తాజాగా స్థానికులు ‘కాటమయ్య గుండు’గా పిలిచే భారీ రాతిబండపై అయ్యదేవుడి అర్థశిల్పాన్ని గుర్తించారు.

గుర్రంపై స్వారీ చేస్తున్న అయ్యదేవుడి రూపంతో పాటు మరో రెండు అర్థశిల్పాలు కూడా రాతిబండపై చెక్కి ఉండటం విశేషం. వరుసగా వెలుగుచూస్తున్న ఈ చారిత్రక ఆనవాళ్లు ముల్కనూరు ప్రాచీన చరిత్రపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

రాతిగుండుపై మూడు అర్థశిల్పాలు
ముల్కనూరులో ఇటీవల గుర్తించిన కళ్యాణీ చాళుక్యుల శాసనం ఉన్న పరుపుబండకు కొంత దూరంలో భారీ రాతిగుండు ఉంది. స్థానికులు దీనిని ‘కాటమయ్య గుండు’గా పిలుస్తున్నారు. ఈ రాతిబండ ఉత్తరాభిముఖంగా మూడు అర్థశిల్పాలు చెక్కి ఉన్నాయి.

వాటిలో గుర్రంపై స్వారీ చేస్తున్న అయ్యదేవుడి శిల్పం ప్రధానంగా కనిపిస్తోంది. కుడిచేతిలో ఆయుధాన్ని భుజంపై ఆనించి, ఎడమ చేతితో గుర్రం కళ్లెం పట్టుకున్న భంగిమలో అయ్యదేవుడు దర్శనమిస్తున్నాడు. గుర్రం ముందు కుక్క ఆకృతిని చెక్కడం ఈ శిల్పానికి ప్రత్యేకతగా నిలుస్తోంది.

స్థానికులు ఈ దేవతా రూపాన్ని ‘కాటమరాజు’గా పిలుస్తున్నారు. గ్రామాలు, పశువులను రక్షించే అయ్యదేవుళ్లను ప్రాంతాన్ని బట్టి కాటమయ్య, కాటమరాజు తదితర పేర్లతో ఆరాధించే సంప్రదాయం ఉందని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.

దేవేరితో భిన్నమైన రూపం
అయ్యదేవుడి వెనుక భాగంలో చేతుల్లో పూజా ద్రవ్యాలు పట్టుకున్న స్త్రీ శిల్పం కూడా కనిపిస్తోంది. సాధారణంగా అయ్యదేవుడు దేవేరితో కలిసి కనిపించే రూపాలకు భిన్నంగా ముల్కనూరులోని శిల్ప నిర్మాణం ఉండటం విశేషమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.

శిల్పాల రూపురేఖలు, నిర్మాణ పద్ధతిని పరిశీలిస్తే ఇవి కళ్యాణీ చాళుక్యుల కాలానికి సమీప కాలానికి చెందినవిగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానికంగా చెక్కిన శిల్పాలు కావడంతో రాజశిల్పాలతో పోలిస్తే నిర్మాణ శైలిలో కొంత వ్యత్యాసం కనిపిస్తోందని వివరించారు.

గుప్త నిధుల వేటతో ఆనవాళ్లకు ముప్పు?
ముల్కనూరులో వెలుగుచూస్తున్న చారిత్రక ఆనవాళ్లకు మరోవైపు గుప్త నిధుల వేట ముప్పుగా మారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాటమయ్య గుండు పరిసరాల్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు.

రాత్రివేళల్లో యంత్రాల సాయంతో తవ్వకాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు అక్కడ జంతు బలులు కూడా ఇచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ తవ్వకాల వల్ల శిల్పాలు, ఇతర పురాతన ఆనవాళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమగ్ర పరిశోధనకు పిలుపు
ఒకే ప్రాంతంలో శాసనం, శిల్పాలు వరుసగా వెలుగులోకి రావడం ముల్కనూరుకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని చాటుతోందని చరిత్రాభిమానులు చెబుతున్నారు. శాసనం ఏ కాలానికి చెందినది? కాటమయ్య గుండుపై ఉన్న శిల్పాలు ఎప్పుడు చెక్కబడ్డాయి? అయ్యదేవుడి ఆరాధనకు ఈ ప్రాంతంతో ఉన్న సంబంధం ఏమిటి? వంటి అంశాలపై శాస్త్రీయ పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది.

పురావస్తు శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టి శిల్పాల కాలాన్ని నిర్ధారించడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని చరిత్రాభిమానులు కోరుతున్నారు. గుప్త నిధుల వేటలో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగుకాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.