
నేటి యువతలో చాలామంది మంచి ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతం, స్థిరమైన కెరీర్ కోసం పరుగులు తీస్తుంటారు. అయితే పులివెందులకు చెందిన కొందరు యువకులు మాత్రం అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఉద్యోగాలను వదిలి వ్యవసాయం వైపు అడుగులు వేసి.. ప్రకృతి సాగుతో సంతృప్తితో పాటు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఆరోగ్యకరమైన పంటలను పండిస్తూ.. తోటి రైతులకు, యువతకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
వ్యవసాయంతోనే సంతృప్తి
వైయస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం ఉల్లిమెల్ల గ్రామానికి చెందిన సుదర్శన్‌రెడ్డి 2011లో బీటెక్ పూర్తి చేసిన అనంతరం బెంగళూరులో ఉద్యోగంలో చేరారు. మంచి జీతం వచ్చినప్పటికీ ఉద్యోగం తనకు సంతృప్తినివ్వలేదని చెబుతున్నారు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో కరోనా సమయంలో స్వగ్రామానికి తిరిగి వచ్చి సాగు రంగంలోకి అడుగుపెట్టారు.
తనకున్న 10 ఎకరాల పొలంలో సేంద్రియ విధానంలో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. బత్తాయి, పామాయిల్ (ఆయిల్‌ఫామ్), శ్రీగంధం, మల్లెపూలతో పాటు శనగ, వేరుసెనగ, పత్తి వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. పెట్టుబడులు పోగా మంచి లాభాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.
తాను అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానంపై ఇతర రైతులకు కూడా అవగాహన కల్పిస్తున్నానని, దీంతో తాను చేస్తున్న పని మనసుకు ఎంతో సంతృప్తినిస్తోందని సుదర్శన్‌రెడ్డి చెబుతున్నారు.
యూట్యూబ్ వేదికగా ‘ప్రకృతి పాఠాలు’
కోటేశ్వరరెడ్డి కూడా ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం వైపు అడుగులు వేసిన యువ రైతు. ఎమ్మెస్సీ పూర్తి చేసిన అనంతరం ఓ కంపెనీలో బీమా ఏజెంట్‌గా పనిచేశారు. అయితే ఉరుకుల పరుగుల ఉద్యోగ జీవితం నచ్చక.. వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో సాగు రంగంలోకి వచ్చారు.
తనకున్న ఐదు ఎకరాల పొలంలో వేరుసెనగ, బుడ్డసెనగ, పత్తి, బత్తాయి పంటలను సాగు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలతో పాటు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ శాఖ, ‘సేవ్’ సంస్థ వ్యవస్థాపకుడు విజయరామ్ నిర్వహించిన అవగాహన సదస్సులకు హాజరై ప్రకృతి వ్యవసాయంపై అనేక విషయాలను నేర్చుకున్నారు.
అక్కడ తెలుసుకున్న సాగు పద్ధతులు, అనుభవాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇతర రైతులతో పంచుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంపై మరింత మందికి అవగాహన కల్పించడమే తన లక్ష్యమని కోటేశ్వరరెడ్డి చెబుతున్నారు.
ఉద్యోగమే జీవితానికి భరోసా అనే ఆలోచనకు భిన్నంగా.. వ్యవసాయంలోనే తమ భవిష్యత్తును వెతుక్కుంటున్న ఈ యువ రైతులు, పట్టుదలతో సాగు చేస్తే వ్యవసాయం కూడా మంచి ఉపాధి మార్గంగా మారుతుందని నిరూపిస్తున్నారు.





